● వెనక చక్రాల నట్లు ఊడి త్రుటిలో తప్పిన ప్రమాదం
● ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
● అద్దె బస్సుల నిర్వహణపై నిఘా ఏది?
జనగామ: ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ హనుమకొండ రోడ్డులోని ఇన్‌న్‌గేట్ సమీపంలో మంగళవారం ఓ అద్దె బస్సు వెనుక చక్రాల నట్లు ఒక్కసారిగా ఊడిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట డిపోకు చెందిన టీఎస్ 29 టీఏ 3071 నంబరు గల బస్సు బస్టాండ్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక చక్రాలకు సంబంధించిన నట్లు, బోల్టులతో సహా ఊడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. డ్రైవర్ మహే ష్ అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఇదే ఘటన జరిగి ఉంటే భారీ ప్రమాదం సంభవించేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
అప్రమత్తమైన డ్రైవర్..
బస్సు ఘటన జరిగిన వెంటనే అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు బస్సు వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ డిపో అధికారులు సైతం ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బస్సును బస్టాండ్ ప్రాంగణంలోకి తీసుకెళ్లి ప్రైవేటు మెకానిక్‌లను పిలిపించి మరమ్మతులు చేయించారు. బస్సు చక్రాల నట్లు ఊడిపోయేంతగా పరిస్థితి దిగజారే వరకు నిర్వహణలో లోపాలు ఎలా గుర్తించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అద్దె బస్సుల కండిషన్ ఎవరు పరిశీలిస్తున్నారు?
ఆర్టీసీ సొంత బస్సులు ప్రతిరోజూ రూట్లలో తిరిగిన అనంతరం డిపో గ్యారేజీకి చేరుకుంటాయి. అక్కడ బ్రేకులు, టైర్లు, స్టీరింగ్, ఇతర యాంత్రిక భాగాల పనితీరును పరిశీలించిన తర్వాతే తిరిగి రోడ్డుపైకి పంపిస్తారు. మరి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడుస్తున్న బస్సుల నిర్వహణ బాధ్యత ఎవరిది, వాటి కండిషన్‌న్‌ను ఎప్పటికప్పుడు ఎవరు పర్యవేక్షిస్తున్నారు, మరమ్మతులు, సర్వీసింగ్ సక్రమంగా జరుగుతున్నాయా అనే ప్రశ్నలు ఈ ఘటనతో తెరపైకి వచ్చాయి. బస్సులు ఓవర్‌లోడ్‌తో నడుస్తున్నాయా, అలా నడుస్తుంటే వాటి నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారా అన్న సందేహాలను ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు.
70–80 కిలోమీటర్ల వేగంలో జరిగితే
బాధ్యత ఎవరిది?
బస్సు సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక చక్రాల నట్లు ఊడిపోతే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఊహించుకోవచ్చు. బస్సులో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలకు భద్రత ఎవరు కల్పిస్తారని ప్రయాణికులు వాపోతున్నారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్టీసీ సంస్థ అద్దె బస్సుల నిర్వహణ విషయంలోనూ అదే స్థాయి శ్రద్ధ చూపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అద్దె బస్సులు ప్రతిరోజూ రూట్లలో తిరిగిన తర్వాత ఎక్కడ మరమ్మతులు చేస్తున్నారు, వాటి కండిషన్‌న్ సర్టిఫికెట్లను ఎవరు పరిశీలిస్తున్నారు, యాంత్రిక లోపాలను గుర్తించేందుకు ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.
సమగ్ర విచారణకు డిమాండ్
ప్రస్తుతం సూర్యాపేట డిపోకు చెందిన అద్దె బస్సులో ఈ ఘటన చోటుచేసుకోగా, జనగామ డిపో పరిధితో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అద్దె బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వాటి నిర్వహణ ప్రమాణాలు ఎలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రయాణికులు కోరుతున్నారు.


