జనగామ రూరల్: పట్టణ ప్రవేశ మార్గంలోని హైదరాబాద్–హనుమకొండ రహదారిపై నందన గార్డెన్స్ ఎదురుగా బంజారా కమ్యూనిటీ ఆధ్వర్యంలో శ్రీ తానునాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విగ్రహాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రజా వినియోగ ప్రదేశాల్లో విగ్రహా లు ఇతర నిర్మాణాల ఏర్పాటుకు అనుమతి లేదని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేయదలచిన స్థలానికి సంబంధించిన కచ్చితమైన జీపీఎస్ కో–ఆర్డినేట్లు, విగ్రహం కొలతలు, నిర్మాణ సామగ్రి, అంచనా వ్యయం, నిధుల సమీకరణ వివరాలు, నిర్మాణ రూపకల్పన చేసిన నిపుణుల వివరాలు, తదితర అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, బంజారా కమ్యూనిటీ చైర్మన్ లక్ష్మీ నారాయణ నాయక్, ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, డీటీడీఓ హసీనా బేగం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


