పూర్వవైభవం వచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

పూర్వవైభవం వచ్చేనా?

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

జనగామ: ఒకప్పుడు వ్యాపార రంగానికి దిక్సూచిగా నిలిచిన జనగామ ఓల్డ్‌ బీటుబజారు నేడు పూర్వ వైభవాన్ని కోల్పోయింది. దశాబ్దాల పాటు వ్యాపారాలకు కేంద్రంగా, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు ప్రధాన కొనుగోలు కేంద్రంగా వెలుగొందిన ఈ ప్రాంతం అభివృద్ధికి రైల్వే గేటు వద్ద రాకపోకల అడ్డంకి ప్రధాన సమస్యగా మారింది. పట్టణంలో ఇతర ప్రాంతాలు వ్యాపారపరంగా విస్తరిస్తున్నప్పటికీ, ఒకప్పటి వ్యాపార కేంద్రమైన పాత బీటుబజారు మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. రైల్వే అండర్‌పాస్‌ను విస్తరించి పెద్ద వాహనాలు వెళ్లేలా నిర్మిస్తే ఈ ప్రాంతానికి పూర్వవైభవం వస్తుందని వ్యాపారులు, పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

దశాబ్దాల పాటు వ్యాపార హబ్‌గా

ఓల్డ్‌ బీటుబజారు సరిహద్దులో మజీద్‌, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాలు ఒకప్పుడు పట్టణ వ్యాపార రంగానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. కిరాణా, హోల్‌సేల్‌, సైకిల్‌ దుకాణాలు, మెడికల్‌ షాపులు, బంగారు ఆభరణాల దుకాణాలు, ఇనుము హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారాలతో ఈ ప్రాంతం రద్దీగా ఉండేది. జిల్లాతో పాటు సిద్దిపేట, భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, గజ్వేల్‌ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు, వినియోగదారులు వచ్చేవారు.

రైతులు..వ్యాపారులకు ప్రధాన కూడలి

ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా పేరొందిన జనగామ వ్యవసాయ మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను విక్రయించేందుకు వచ్చేవారు. మార్కెట్‌లో పంటలు విక్రయించిన అనంతరం హెడ్‌ పోస్టాఫీస్‌ మీదుగా రైల్వే గేటు దాటి ఓల్డ్‌ బీటుబజారుకు చేరుకుని అవసరమైన సరుకులు కొనుగోలు చేసేవారు. అప్పట్లో రవాణాలో ఎడ్లబండ్లదే ప్రధాన పాత్ర.

ఫ్లైఓవర్‌తో మారిన వ్యాపార ముఖచిత్రం

మూడు దశాబ్దాల క్రితం నెహ్రూ పార్కు నుంచి జిల్లా ప్రధాన ఆస్పత్రి ముఖద్వారం వరకు రైల్వే లైన్‌ ఫ్లైఓవర్‌ నిర్మించారు. అనంతరం రైల్వే గేటును పూర్తిగా మూసివేసి, మినీ అండర్‌పాస్‌ ఏర్పాటు చేశారు. దీంతో ట్రాక్టర్లు, మినీ డీసీఎంలు, సరుకు రవాణా వాహనాలకు ఈ మార్గం మూసుకుపోయింది. ఫలితంగా ఓల్డ్‌ బీటుబజారుకు వచ్చే వ్యాపారులు, వినియోగదారుల రాకపోకలు తగ్గి వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడింది.

అభివృద్ధి ఒకవైపేనా

ఫ్లై ఓవర్‌ నిర్మాణం తర్వాత నెహ్రూ పార్కు, గాంధీ చౌరస్తా, ఆర్టీసీ జంక్షన్‌, హైదరాబాద్‌–సూర్యాపేట రహదారుల వైపు వ్యాపారాలు విస్తరించాయి. కొత్త వాణిజ్య కేంద్రాలు ఏర్పడి పట్టణ వ్యాపార ముఖ చిత్రం మారిపోయింది. అయితే ఒకప్పుడు జనగామకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాత బీటు బజారు మాత్రం వెనక బడిపోయింది. రైల్వే గేటు వద్ద పెద్ద అండర్‌పాస్‌ నిర్మించాలని గతంలో పలుమార్లు ఉద్యమాలు, విజ్ఞప్తులు చేసినా ఆశించిన స్పందన లేదు.

పెద్ద అండర్‌పాస్‌తోనే పరిష్కారం

ప్రస్తుతం ఉన్న అండర్‌పాస్‌లో వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు ఫ్లైఓవర్‌ మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. పెద్ద వాహనాలు, అంబులెన్స్‌లు, సరుకు రవాణా వాహనాలు సైతం వెళ్లేలా విశాలమైన అండర్‌పాస్‌ నిర్మిస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పాత బీట్‌ బజారు నుంచి గ్రేయిన్‌ మార్కెట్‌కు వెళ్లే రైతులు, వ్యాపారులకు ప్రయాణ భారం తగ్గుతుంది. జనగామ అభివృద్ధి అంటే కొత్త ప్రాంతాల్లోనే వ్యాపారా లు విస్తరించడం కాదు.. దశాబ్దాల చరిత్ర కలిగిన పాత వాణిజ్య కేంద్రాలకూ పూర్వవైభవం తీసుకురావడం చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

దశాబ్దాలుగా ప్రధాన వ్యాపార కేంద్రం..

ఫ్లైఓవర్‌ నిర్మాణంతో మారిన

వ్యాపార ముఖచిత్రం

అడ్డంకిగా మారిన అండర్‌పాస్‌

రైల్వే అండర్‌పాస్‌ను విస్తరిస్తే

మళ్లీ ఊపందుకోనున్న వ్యాపారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement