జనగామ: జిల్లాలో సన్నబియ్యం కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. సన్నబియ్యం కొరత, ధరల పెంపుపై ఈనెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కృత్రిమ కొరత– నిగ్గుతేలుస్తారా?’ కథనానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించారు. అక్రమ నిల్వలు, కృత్రిమ కొర త, అధిక ధరలకు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా నుంచి మండల స్థాయి వరకు నిఘా, తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు స్థాయిల్లో ప్రత్యేక బృందాలు
జిల్లా స్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్‌కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చైర్ పర్సన్‌గా, రెవెన్యూ అదనపు కలెక్టర్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. డీసీఎస్‌ఓ సభ్య కన్వీనర్‌గా ఉంటారు. డీసీపీ (వెస్ట్‌జోన్), సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్, లీగల్ మెట్రాలజీ, రాష్ట్ర పన్నుల శాఖ, మార్కెటింగ్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, సహకార, ఆహార భద్రత శాఖల అధికారులు, సంబంధిత ఆర్డీఓలు, రవాణా అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతీ సోమ, గురువారాల్లో తనిఖీల పురోగతిని సమీక్షించనున్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్లలో ఆర్డీఓల నేతృత్వంలో డివిజనల్ ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఏసీపీ, పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ, వాణిజ్య పన్నులు, మార్కెట్ కమిటీ, ఆహార భద్రత శాఖల అధికారులు ఉంటారు. జిల్లాలోని 12 మండలాల్లో తహసీల్దార్ల నేతృత్వంలో మండల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను నియమించారు.
నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు
నేటి(బుధవారం)నుంచి వచ్చే నెల డిసెంబర్ 2 వర కు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీల కార్యక్రమం కొనసాగనుంది. ఈనెల 5లోగా బియ్యం మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ కిరాణా దుకాణాలు, ప్రైవేట్ గోదాముల వివరాలను తహసీల్దార్లు నమోదు చేయాలి. 6లోగా జిల్లా పౌరసరఫరాల అధికారి స మగ్ర జాబితాను రూపొందించాలి. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరల పట్టికలను 7లోగా ప్రతి మిల్లు, హోల్‌సేల్, రిటైల్ దుకాణం వద్ద తెలు గు, ఆంగ్ల భాషల్లో స్పష్టంగా ప్రదర్శించాలి. 10 లోగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ రైస్ మిల్లులు, హోల్‌సేల్ వ్యాపారుల నిల్వలను భౌతికంగా తనిఖీ చేయాలి. 12లోగా బృందాలు రిటైల్ దుకాణాల్లో నిల్వలను పరిశీలించాలి. రికార్డుల్లోని వివరాలకు, వాస్తవ నిల్వలకు తేడాలుంటే చర్యలు తీసుకోనున్నారు.
రైతులు, వినియోగదారులకు భరోసా
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి 24 గంటల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించా రు. రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసే దళారులు, వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండటంతో పాటు రశీదులు ఇవ్వాలి. పెరిగిన బియ్యం ధరల నుంచి ప్రజలకు ఉపశ మనం కల్పించేందుకు జనగామ, ఘన్‌పూర్‌తో పాటు మండల కేంద్రాల్లో ప్రభుత్వ నిర్దేశిత ధరలకు బియ్యం విక్రయించే ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్
బియ్యం అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలు, కృత్రిమ కొరత సృష్టించడం వంటి అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుంది. ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు తీసుకోనున్నారు. ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబర్–1800 425 6605, వాట్సాప్ నంబర్– 8019663344 నంబర్లలో సంప్రదించాలి.
అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని రీ–పాలిష్ చేసి బ్రాండెడ్ సంచుల్లో అధిక ధరలకు విక్రయించడం, రేషన్ కార్డుదారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించా రు. తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు–2016, నిత్యావసర వస్తువుల చట్టం–1955, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నారు.
సన్నబియ్యం అక్రమాలపై ఉక్కుపాదం
ధరల నియంత్రణకు కలెక్టర్ కార్యాచరణ
జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు
నేటి నుంచి డిసెంబర్ 2 వరకు ప్రత్యేక తనిఖీలు
ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు


