బచ్చన్నపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య జరిగిన వాగ్వాదంపై విద్యాశాఖ విచారణ పూర్తి చేసింది. ఈ ఘటనకు సంబంధించి మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ‘బచ్చన్నపేట పెద్దబడిలో టీచర్ల కొట్లాట’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎంఈఓ స్పందించారు. ఎంఈఓ పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుడితో పాటు సంబంధిత ఉపాధ్యాయులు బి.పృథ్వీరాజ్ (స్కూల్ అసిస్టెంట్–ఇంగ్లిష్), ఎస్.కృష్ణమోహన్ (స్కూల్ అసిస్టెంట్–గణితం)ను విచారించారు. విచారణలో భాగంగా అక్టోబర్ 28న పాఠశాల స్టాఫ్ రూమ్‌లో వ్యక్తిగత విషయాలపై ఇద్దరి మధ్య వా గ్వాదం జరిగినట్లు ఉపాధ్యాయులు అంగీకరించా రు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ బల్లపై ఉన్న పుస్తకా ల ను తోసివేయగా, ఒక ప్లేట్ కిందపడినట్లు వెల్లడైంది. అయితే భౌతిక దాడి జరగలేదని, కేవలం సాధారణ వాగ్వాదమే చోటు చేసుకుందని ఇద్దరు ఉపాధ్యాయులు స్పష్టం చేసినట్లు నివేదికలో పేర్కొన్నా రు. ఘటనపై గత నెల 29న ఇద్దరు ఉపాధ్యాయులకు హెచ్‌ఎం నోటీసులు జారీ చేసి, వారి నుంచి లిఖితపూర్వక వివరణలు తీసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రవర్తన పాఠశాల వాతావరణానికి, ఉపాధ్యాయ వృత్తి గౌరవానికి తగదని ఎంఈఓ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి, హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.


