జన జాతీయ గౌరవ దివస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

జన జాతీయ గౌరవ దివస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

జనగామ రూరల్‌: జిల్లాలో జన జాతీయ గౌరవ దివస్‌–2026, రిఫార్మ్స్‌ ఉత్సవ్‌ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భగవా న్‌ బిర్సాముండా జయంతిని పురస్కరించుకొని ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు జన జాతీయ గౌరవ దివస్‌, అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 25వ తేదీ వరకు రిఫార్మ్స్‌ ఉత్సవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 బ్లాకులు, గుర్తించిన 9 గిరిజన గ్రామాల్లో వివిధ అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఉత్సవ్‌లో భాగంగా గిరిజన విద్యార్థులకు ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌, టాప్‌ క్లాస్‌ ఉపకార వేతనాలపై అవగాహన కల్పించాలని, దరఖాస్తుల సమర్పణకు సహాయ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీడీఓ హసీనా బేగం, డీఏఓ అంబికా సోనీ, డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

జీఓ 25ను సవరించాలి

జనగామ రూరల్‌: ప్రాథమిక పాఠశాలలకు ఇబ్బందికరంగా మారిన జీఓ 25ను తక్షణమే సవరించాలని, ప్రతీ ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను, 50 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సంఘ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రధానోపాధ్యాయులపై యాప్‌ల భారం తొలగించాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని కోరారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని, జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం టీయూటీఎఫ్‌కు చెందిన రాష్ట్ర బాధ్యులు బుర్ర రమేశ్‌, రావుల వెంకటేశ్వర్లు, జిల్లా బాధ్యులు ఈర్యా, భగవాన్‌రెడ్డి, బోగెల్లి మధుకర్‌, గోవర్ధన్‌, సమ్మక్క, భీమా టీఎస్‌యూటీఎఫ్‌లో చేరారు. కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడూరి వెంకటేష్‌, జిల్లా కార్యదర్శులు కృష్ణ, కృష్ణమూర్తి, సోషల్‌ వెల్ఫేర్‌ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు, రావుల వెంకటేశ్వర్లు, శ్రీధర్‌, శ్రీనివాస్‌, కనక య్య, అగయ్య, ఉప్పలయ్య, గోవర్ధన్‌న్‌ రెడ్డి, రమేశ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, హిమబిందు, మమత, మాధవి, మహేష్‌, అహ్మద్‌ పాషా, రవీందర్‌, నర్సింహులు, ముజీబ్‌, శ్రీకాంత్‌, నవీన్‌, రాజమల్లు, సయ్యద్‌, యాదగిరి పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

జనగామ రూరల్‌: నకిలీ ఓట్లను తొలగించేందు కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తు న్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలో టీచర్లు, డాక్టర్లను, మేధావులను మంగళవారం కలిసి సర్‌పై అపోహలను విడనాడాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంతరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

6న జాబ్‌మేళా

కాళోజీ సెంటర్‌: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. సాత్విక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఖాళీగా ఉన్న 30 ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు పురుషులు అర్హులన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. వరంగల్‌, కాజీపేట, హనుమకొండ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement