మహిళల పండగలో ప్రొట్రోకాల్‌ ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

మహిళల పండగలో ప్రొట్రోకాల్‌ ఎందుకు?

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

● మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి

జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో మహిళలు జరుపుకునే సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రొటోకాల్‌ పేరుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రగడ చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మూరు ప్రశాంత్‌రెడ్డిని వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడంపై స్పందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. గత ఏడాది ఎమ్మెల్యే సతీమణి బతుకమ్మ వేదికపైకి వచ్చినప్పుడు లేని ప్రొటోకాల్‌ అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. 80 శాతం రైతులకు ప్రాతినిధ్యం వహించే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డికి ప్రొటోకాల్‌ లేదనడం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి నమోదు చేయించిన 25వేల దొంగ ఓట్ల అక్రమాలు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బయటకు వచ్చాయని, అలాగే కాంగ్రెస్‌కు చెందిన ఐదు వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఈ అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చేర్యాల ఏఎంసీ చైర్మన్‌ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తే రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్‌ రెడ్డి, నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, కడకంచి శ్రీనివాస్‌, మంత్రి శ్రీశైలం, వేమెళ్ల పద్మ, జమాల్‌ షరీఫ్‌, వంగాల మల్లారెడ్డి, కొత్త కరుణాకర్‌రెడ్డి, నర్సిరెడ్డి, విజయ్‌, సురేందర్‌, శివ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement