సంబురాలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సంబురాలకు సిద్ధం

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

దసరా వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

జనగామ: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈనెల 20న (మంగళవారం) విజయదశమి వేడుకలకు జిల్లా ముస్తాబైంది. ప్రధాన కూడళ్లు విద్యుత్‌ దీపాల అలంకరణలతో కళకళలాడుతుండగా, ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రావణవధ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

బతుకమ్మకుంటలో రావణ వధ..

పట్టణంలోని బతుకమ్మ కుంట కట్టపై సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న రావణ వధ కార్యక్రమం కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మకుంట పరిసరాల్లో విద్యుత్‌ దీపాల అలంకరణ, ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు చేశారు. హనుమకొండ, హైదరాబాద్‌కు చెందిన నిపుణుల ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. మధ్యాహ్నం బతుకమ్మకుంటలోని శ్రీ విజయదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జమ్మిచెట్టుకు పూజలు చేయనున్నారు. సాయంత్రం లేజర్‌ లైటింగ్‌ షో, బాణసంచా ప్రదర్శనల నడుమ రావణవధ కార్యక్రమం జరగనుంది. వేడుకలను తిలకించేందుకు పట్టణ ప్రజలు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

గ్రామగ్రామాన జమ్మి పూజలు

దసరా సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోనూ పండుగ సందడి నెలకొంది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఆలయాల ఆవరణలో ఉన్న జమ్మి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. మధ్యాహ్నం నుంచి జమ్మి పూజలు, ఆలయ దర్శనాలతో పల్లెల్లో పండుగ సందడి మరింత పెరగనుంది.

జోరుగా వ్యాపారాలు

దసరా పండుగను పురస్కరించుకొని వ్యాపార లావాదేవీలు జోరుగా సాగాయి. కిరాణా సరుకులు, వస్త్రాలు, మాంసం, మద్యం, పూలు, పండ్ల దుకాణాల్లో కొనుగోళ్లు పెరిగాయి. కొత్త దుస్తుల కొనుగోళ్లతో వస్త్ర దుకాణాలు రద్దీగా మారగా, పండుగ అవసరాల కోసం ప్రజలు వివిధ మార్కెట్లకు తరలివెళ్తున్నారు. వ్యాపార సంస్థల్లో దసరా పండుగ సందడి కనిపిస్తోంది.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో ముగియగా, విజయదశమి సందర్భంగా మంగళవారం అమ్మవారి నిజరూప దర్శనంతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే విజయదశమిని భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. సంప్రదాయ పూజలు, జమ్మి వృక్ష దర్శనం, ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జిల్లా కేంద్రంలో రావణ వధ వేడుకలతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

నేడు జిల్లాకేంద్రంలోని బతుకమ్మకుంటలో రావణవధ..

జమ్మి పూజలు, లేజర్‌ లైటింగ్‌ షో, ప్రత్యేక అలంకరణలతో కళకళ

పండుగ వేళ జోరుగా వ్యాపారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement