● మిల్క్‌షెడ్ డిప్యూటీ డైరెక్టర్
గోపాల్‌సింగ్
లింగాలఘణపురం: జిల్లాలో రోజుకు 40వేల లీటర్ల పాల ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకొని 2వేల మందికి పాడి పశువులకు రుణాలు ఇచ్చేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జనగామ మిల్క్‌షెడ్ డీడీ గోపాల్‌సింగ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీసీయూ పరిధిలోని చైర్మన్లు, కార్యదర్శులతో పాటు బ్యాంక్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ డెయిరీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక్కొక్క రైతుకు మొదటగా రూ.2 లక్షల వరకు రుణాలను ఇప్పించి రూ.లక్ష ఒక గేదెకు, మరో రూ.లక్ష ఆరు నెలల తర్వాత రెండో గేదెకు రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు వెయ్యి మంది నుంచి దరఖాస్తులు స్వీకరించామని, తక్కువ వడ్డీతో ఇచ్చే రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో బ్యాంక్ ఫీల్డ్ అఫీసర్ జత్‌రామ్, పాలకేంద్రాల చైర్మన్లు తిరుమలయ్య, దయాకర్‌రెడ్డి, రాధమ్మ, బాలరాజు, యాదగిరి, సూపర్‌వైజర్లు వెంకట్‌రెడ్డి, జయసింహరెడ్డి, కార్యదర్శులు శ్రీశైలం, మల్లారెడ్డి,రేణుక తదితరులు పాల్గొన్నారు.


