భవితకు వెలుగు | - | Sakshi
Sakshi News home page

భవితకు వెలుగు

Aug 29 2026 1:34 AM | Updated on Aug 29 2026 1:34 AM

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఇన్‌స్పైర్‌ మనక్‌

ఆలోచనకు పదను..

జనగామ రూరల్‌: విద్యార్థుల ఆలోచనలకు పదను పెడుతూ వారి సృజనాత్మక, పరిశోధన దృక్పథాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, వారిని భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఇన్‌స్పైర్‌ మనక్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక ప్రతిభను వెలికితీయడానికి ఇది చక్కటి వేదికగా దోహదపడుతోంది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇన్‌స్పైర్‌ మనక్‌ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా జిల్లాలో ఇప్పటి వరకు 50 వరకు నామినేషన్లు కాగా వచ్చే నెల వరకు గడువు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు రానున్నాయి. గతేడాది 997 నామినేషన్లు వచ్చాయి.

విద్యార్థులకు బహుమతులు

విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పరిశీలిస్తారు. దేశవ్యాప్తంగా లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ఒక్కో ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి, విద్యార్థులను మరింతగా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రోత్సహించడానికి రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. తద్వారా ప్రాజెక్టును రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది. గతేడాది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు సుమారు 997 వరకు ప్రాజెక్టులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చాయి. ఇందులో ఒకటి జాతీయ స్థాయికి ఎంపికైంది. విద్యార్ధికి రూ.10వేల చొప్పున బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రాజెక్టు తయారీకి, మిగిలినవి ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులకు వినియోగించాలి. జాతీయ స్థాయిలో పేటెంట్‌కు ఎంపికై న విద్యార్థులకు జాతీయ, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో రిజర్వేషన్‌ కూడా ఉంటుంది.

విద్యార్థులకు వివరించాలి

విద్యార్థులను ఇన్‌స్పైర్‌ మనక్‌ కార్యక్రమంలో పాల్గొనేలా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. తల్లిదండ్రుల్లో చాలా మందికి అవగాహన ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్య కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులే చొరవ తీసుకోవాలి. తమ విద్యార్థులను ప్రోత్సహించి వారి ఆవిష్కరణలను రిజిస్ట్రేషన్‌ చేయిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. తమ ప్రాజెక్టులను సెప్టెంబర్‌ 15లోపు www.inspireawards. dst.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి.

బైక్‌ స్టాండ్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌

నూతన అవిష్కరణలకు నాంది

ప్రాజెక్టు ఎంపికై తే విద్యార్థికి

రూ.10వేల ప్రోత్సాహకం

సెప్టెంబర్‌ 15 వరకు ప్రాజెక్ట్‌

నామినేషన్‌కు అవకాశం

జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 50

ఈఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని పేరు జి.అక్షిత. జనగామ మండలంలోని చౌడారం కేజీబీవీలో 9వ తరగతి చదువుతోంది. గతేడాది ఇన్‌స్పైర్‌ మనక్‌లో జిల్లా నుంచి ఉత్తమ ప్రాజెక్ట్‌తో జాతీయ స్థాయికి ఎంపికై ంది. బైక్‌ స్టాండ్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో ద్విచక్ర వాహనదారులు సైడ్‌ స్టాండ్‌ భూమి ఎగువ దిగువ ఉన్న చోట కింద పడకుండా దానంతట అదే భూమిని అడ్జెస్ట్‌ చేసుకొనే ఆటోమెటిక్‌ స్టాండ్‌ను అమర్చింది.

వందశాతం నామినేషన్లకు చర్యలు తీసుకోవాలి

ఇన్‌స్పైర్‌ మనకు వినూత్న ఆవిష్కరణలను గుర్తించి గడువులోగా జిల్లా వ్యాప్తంగా వందశాతం నామినేషన్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఉత్తమ ప్రాజెక్టుల ఎంపికకు అవసరమైన సూచనలు చేస్తాం

– సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి

సైన్స్‌ ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులను ప్రోత్సహిస్తే నూతన ఆవిష్కరణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఇన్‌స్పైర్‌ మనక్‌ రిజిస్ట్రేషన్లు ఊపందుకునేలా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.

– ఉపేందర్‌, జిల్లా సైన్స్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement