● రాఖీ పండుగ వేళ జనగామ నుంచి
హనుమకొండకు రూ.160
● డీలక్స్ బస్సులో ఏకంగా రూ.40పెంపు
జనగామ: రాఖీ పండుగ వేళ ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం పడింది. జనగామ నుంచి హనుమకొండకు వెళ్లే డీలక్స్ బస్సు టికెట్ ధర గతంలో రూ.120 ఉండగా శుక్రవారం నుంచి రూ.160కు పెంచారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా రూ.40 పెంచడంతో బస్సుల్లో ప్రయాణికులు కండక్టర్లను ప్రశ్నించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామనే పేరుతో ఇతర ప్రయాణికులపై అదనపు భారం మోపడం సరికాదని ఆరోపిస్తున్నారు. జనగామకు చెందిన మహమ్మద్ రియాజ్ జనగామ నుంచి హనుమకొండకు ప్రయాణిస్తుండగా రూ.160 టికెట్ ఇవ్వడంపై కండక్టర్‌ను ప్రశ్నించా రు. అయితే చార్జీ పెరిగిందని, అంతే చెల్లించాల్సి ఉంటుందని సమాధానం వచ్చినట్లు తెలిపారు. కాగా, పండుగను పురస్కరించుకుని ఈ నెల 28, 31 తేదీల్లో రెండు రోజులు మాత్రమే టికెట్ ధరలు పెంచుతున్నట్లు జనగామ డిపో మేనేజర్ ఉషా తెలిపారు.
కిక్కిరిసిన ప్రయాణికులు
పండుగ ముగించుకుని స్వస్థలాలకు తిరుగు ప్రయాణం కావడంతో బస్టాండ్లలో మరింత రద్దీ కనిపించింది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఒక్కో సర్వీసులో 80 నుంచి 90 మంది వరకు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


