డీజీపీ, సీఎస్‌లను కలిసిన డీసీపీ రాజమహేంద్రనాయక్‌ | - | Sakshi
Sakshi News home page

డీజీపీ, సీఎస్‌లను కలిసిన డీసీపీ రాజమహేంద్రనాయక్‌

Aug 29 2026 1:34 AM | Updated on Aug 29 2026 1:34 AM

జనగామ: ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా డీసీపీ రాజమహేంద్రనాయక్‌ డీజీపీ సీవీ ఆనంద్‌ను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జూజును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన రాజమహేంద్ర నాయక్‌ను డీజీపీ, సీఎస్‌ అభినందించి భవిష్యత్‌లో మరింత సమర్థవంతగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. అనంతరం రాజమహేంద్ర నాయక్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

రైస్‌మిల్లుల్లో అక్రమాలకు పాల్పడితే కేసులు

పాలకుర్తి టౌన్‌: రైస్‌మిల్లుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మాచన రఘునందన్‌ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు మిల్లర్లు తనిఖీల సమయంలో అందుబాటులో ఉండడకుండా, మిల్లులకు సంబంఽధించిన రికార్డులను అధికారులకు చూపకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై కేసులు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. మండలంలోని వావి లాల గ్రామంలోని అన్నపూర్ణ రైస్‌ ఇండస్ట్రీస్‌లో ధాన్యాన్ని సక్రమంగా నిల్వ చేయకపోవడంతో కొంత ధాన్యం మిల్లింగ్‌కు పనికిరాకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా జితేందర్‌నాయక్‌

రఘునాథపల్లి: షెడ్యూల్డ్‌ ట్రైబర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని గిద్దబండతండా గ్రామానికి చెందిన బానోతు జితేందర్‌నాయక్‌ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు దేవదాస్‌నాయక్‌ నునావత్‌ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జితేందర్‌నాయక్‌ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ప్రాసెస్‌ విధానంతో రైతుల ఆర్థికాభివృద్ధి

జఫర్‌గఢ్‌: రైతులు పండించిన పంటలను ప్రాసెస్‌ చేసి అమ్ముకున్నట్లయితే ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని నాబార్డ్‌ ఏజీఎం విజయ్‌కుమార్‌ సూచించారు. మండలంలోని హిమ్మత్‌నగర్‌ గ్రామంలో నాబార్డ్‌ సహకారంతో శుక్రవారం స్పందన సర్వీసెస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.. పంటలు పండించడంతో పాటు బిజినెస్‌ విధానాన్ని పాటించాలన్నారు. స్పంద న సర్వీస్‌ సొసైటీ కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ.. సంఘం ద్వారా ఇప్పటికే డ్రోన్‌తో సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఈఓ టి.రజిత, సంఘం సభ్యులు ఎర్ర సతీష్‌, మెరుగు రమేశ్‌, ఓరుగంటి రాజు, నాగరాజు, డ్రోన్‌ అపరేటర్‌ ఓరుగంటి రమేశ్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

వృద్ధురాలి మృతి..

గ్రామంలో ఉద్రిక్తత

లింగాలఘణపురం: మండల కేంద్రానికి చెందిన బెజ్జం అండాలు (75) అనే వృద్ధురాలు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. కాగా, మృతదేహాన్ని ఆమె మృతికి కారకులయ్యారని ఆరోపిస్తూ దేశ్‌ముఖ్‌ల ఇంటి ముందు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో లింగాలఘణపురం ఎస్సై శ్రావణ్‌కుమార్‌, రఘునాథపల్లి ఎస్సై నరేశ్‌, జనగామ ఎస్సైలు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. దీంతో మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. వారం రోజుల క్రితం దేశ్‌ముఖ్‌లతో భూవివాదం నేపథ్యంలో మృతురాలు కోడలు బెజ్జం స్వప్న మందు గోలీ లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆందోళనకు గురైన వృద్ధురాలు అండాలు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయంపై ఎస్సై శ్రావణ్‌కుమార్‌ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement