చిల్పూరు: ప్రస్తుత తరుణంలో రైతులు వరి పంటతో పాటు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలోని రైతు వేదికలో బుధవారం రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఆరుతడి, కూరగాయల విత్తన మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షపాతం ఉన్నందున భూగర్భజలాలు అడుగంటి పంటలకు సాగునీరు అందడం కష్టంగా ఉంటుందన్నారు. రైతులు పూర్తిగా వరిసాగుపైనే కాకుండా ఆరుతడి పంటలను సాగుచేయాలని అందుకు ప్రభుత్వం విత్తనాలను అందజేయడంతో పాటు మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ఆయిల్‌పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందిస్తుందని ఈపంటను వేసుకునే రైతులకు అన్ని రకాల సబ్సిడీ అందివ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ఆరుతడి పంటల సాగులో ఆదర్శంగా నిలిచిన బిల్ల మల్లారెడ్డితో పాటు ప్రగతిశీల రైతులను సన్మానించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికాసోని, మండల వ్యవసాయాధికారి నరసింగరావు, హార్టికల్చర్ సందీప్, మండల పశువైద్యాధికారి అన్వేష్, సర్పంచ్ లావణ్యమల్లారెడ్డి, ఉప సర్పంచ్ పసుల వెంకటేశ్వర్లు , ఏఈఓలు కిరణ్, ప్రవళిక, యాకూబ్ రైతులు మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, రవీందర్‌రెడ్డి, మధు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


