పాలకుర్తి టౌన్: వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతారెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజవర్గంలో శాంతభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగాలని కోరారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కమిషనర్ హామీ ఇచ్చారు.
క్రైస్తవ సంక్షేమ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: తెలంగాణ క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన క్రైస్తవ మైనారిటీల నుంచి మూడు సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్ మంగళవారం తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద కుట్టుమిషన్లు, చిన్న వ్యాపారాల ప్రారంభానికి రూ.50 వేల ఆర్థిక సహాయం, డ్రైవర్ సాధికారత కార్యక్రమం కింద రూ.1.50 లక్షల విలువైన ఈ–బైక్‌లు, ఈ–స్కూటీలు, పెట్రోల్ బైక్‌లు, స్కూటీల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుట్టుమిషన్లు, చిన్న వ్యాపార యూనిట్లకు 21 నుంచి 55 ఏళ్ల వయస్సు, డ్రైవర్ సాధికారత పథకానికి 21 నుంచి 50 ఏళ్ల వయస్సు గల క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల18 వరకు పూర్తి వివరాలు సమర్పించి, ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం https//tgobmms. cgg.gov.in వెబ్‌సైట్‌లో సందర్శించాలని, సందేహాల నివృత్తి కోసం 040 –29801130, 040–23391067 నంబర్లను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సూచించారు.
పాఠశాలకు రూ.లక్ష విరాళం
లింగాలఘణపురం: మండలంలోని కుందారం ప్రాథమిక పాఠశాలకు మంగళవారం ఎన్‌ఆర్‌ఐ గంగసాని రాజేశ్వర్‌రెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యావలంటీర్ ఏర్పాటుకు వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ కూకట్ల రాజు, హెచ్‌ఎం మంజుల, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రవీందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
డిజిటల్ విద్యకు ప్రాధాన్యమివ్వాలి
లింగాలఘణపురం: పాఠశాలల్లో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని నేలపోగుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, పరిసరాల పరిశుభ్రత, క్రీడలు, కంప్యూటర్ లాబ్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఫాస్ట్‌మ్యాథ్స్ పుస్తకాన్ని వినియోగిస్తూ ప్రాథమిక సూత్రాలతో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెరిగే విధంగా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఎన్‌ఆర్‌ఐ లక్ష్మినారాయణ, హెడ్మాస్టర్ నవీన్‌కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు.


