● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు నీరే జీవనాడి అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జనగామ నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి పరిస్థితిపై మాట్లాడారు.. సమ్మక్క సారక్క ప్రాంతం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క చుక్కనీటిని కూడా ఎత్తలేదని ఆరోపించారు. బొమ్మకూరు రిజర్వాయర్‌లో 198 టీఎంసీల సామర్థ్యానికి 58 టీఎంసీలు, గండిరామారంలో 400 ఎంసీఎఫ్‌టీలకు 1 88, కన్నెబోయిన రిజర్వాయర్‌లో 152.8 ఎంసీఎఫ్‌టీలకు 76.6, వెల్డండలో 150.42 ఎంసీఎఫ్‌టీలకు 49, తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో 300 ఎంసీఎఫ్‌టీలకు 100ఎంసీఎఫ్‌టీలు మాత్రమే నీరు ఉందన్నారు. బచ్చన్నపేట, చేర్యాల తదితర ప్రాంతాలకు నీరు అందించే రిజర్వాయర్లలో కూడా తగినంత నీరు లేదని, రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు నీటిని సమర్థవంతంగా వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దీనివల్ల జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో రిజర్వాయర్లు అడుగంటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


