ఆమోదం..51అంశాలు | - | Sakshi
Sakshi News home page

ఆమోదం..51అంశాలు

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ బాలమణిశ్రీనివాస్‌

మాట్లాడుతున్న కౌన్సిలర్‌ గునిగంటి వెన్నెల

జనగామ: మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం సోమవారం పురపాలిక కార్యాలయ సమావేశం హాలులో చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగింది. పట్టణ పరిధిలోని పలు వార్డుల అభివృద్ధి పనులు, ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై కౌన్సిల్‌ సభ్యులు 17శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల మరణించిన విద్యుత్‌ లైన్‌మన్‌కు నివాళులర్పించారు. 43 ఎజెండా, 8 టేబుల్‌ మొత్తం 51 అంశాల కు ఆమోదం లభించింది. కోతుల బెడద నివారణ కోసం రూ.15 లక్షలు కేటాయించారు. వనమహోత్సవంలో 2.50లక్షల మొక్కల పెంపకం, పట్టణంలో విద్యుత్‌ దీపాల నిర్వహణ కోసం రూ.5 లక్షలు కేటాయింపు, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్ట డం, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు నిధులు కేటాయింపు, వీధి కుక్కలు, పందుల నివారణ చర్యలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. జంతు వధశాల నిర్వహణ కోసం రూ.5 లక్షలకు టెండర్లు పిలిచేందుకు ఆమోదం, పట్టణంలో 4 ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాల్లో వ్యాపారస్తులు, షాపుల నుంచి చెత్తను బహిరంగంగా వేయకుండా మున్సిపల్‌ వాహనాలకే ఇచ్చే విధంగా చర్యలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించాలని చైర్‌పర్సన్‌, కమిషనర్‌ ఆదేశించారు.

కౌన్సిల్‌ కీలక చర్చ

కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణంలోని ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు, బార్‌, రెస్టారెంట్ల నుంచి ఉత్పత్తయ్యే బల్క్‌ వేస్ట్‌ కోసం నెలకు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.10,000 వరకు ఫీజు విధించేందుకు కౌన్సిల్‌లో చర్చించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌– 2026 ప్రకారం పట్టణంలోని 30 వార్డుల్లో ఏప్రిల్‌–1 నుంచి గృహ యజమానుల నుంచి చెత్త తీసుకునే ఆటోలకు యూజర్‌ఛార్జీలుగా నెలకు ఒక్కొక్క ఇంటికి రూ.100 వసూలు చేసేందుకు ఎజెండా తీసుకు రాగా, పలువురు కౌన్సిలర్లు అంగీకరించలేదు.

సమస్యలు ఇలా..

3వ వార్డు కౌన్సిలర్‌ బూడిద జ్యోతి మాట్లాడుతూ కౌన్సిల్‌ ఆధునీకరణకు రూ.20 లక్షలకు బదులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.10 లక్షలతో పూర్తి చేయాలని సూచించారు. చెత్త సేకరణకు రూ.100 వసూలు చేయడం సాధ్యం కాదని, పేద ప్రాంతాలైన ధర్మకంచ, సంజయ్‌నగర్‌, గిర్నిగడ్డ, కురుమవాడ తదితర ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 25వ వార్డు సభ్యులు పాముకుంట్ల ప్రసాద్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తన వార్డులోని గాంధీ కమ్యూనిటీ హాల్‌, లైబ్రరీ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటి కోసం మూడు నెలల క్రితమే ఎస్టిమేషన్‌ వేసినప్పటికీ ఇంతవరకు ఎజెండా లో పెట్టకపోవడం సమంజసం కాదన్నారు. వడ్లకొండ ప్రభుత్వ సముదాయాల వద్ద బస్‌ షెల్టర్‌ కోసం లయన్స్‌ క్లబ్‌ నుంచి 50శాతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చారని, మిగతా 50శాతం నిధులు మున్సిపల్‌ కౌన్సిల్‌ సహకారం అందించాలన్నారు. నెహ్రూపార్కు, గాంధీ సెంటర్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేందుకు సిగ్నల్‌ ఏర్పాటు చేయాలన్నారు. 9వ వార్డు కౌన్సిలర్‌ గునిగంటి వెన్నెలరామక్రిష్ణ మాట్లాడుతూ ప్రతి వార్డులో ఎస్‌ఐఆర్‌ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి బీఎల్‌ఓను అందుబాటులో ఉంచి పత్రాలు తప్పులు లేకుండా నింపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 26వ వార్డులో కోతులు, కుక్కలు, పందులతో ఇబ్బందులు పడుతున్నామని కౌన్సిలర్‌ సేవెల్లి మధు అన్నారు. సమావేశంలో కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సజావుగా మున్సిపల్‌ కౌన్సిల్‌

సాధారణ సమావేశం

కోతుల బెడద నివారణకు

రూ.15 లక్షలు

2.50లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement