సుజలం..సురక్షితం | - | Sakshi
Sakshi News home page

సుజలం..సురక్షితం

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

జనగామ: పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు నాణ్యత ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని తాజా ప్రయోగశాల పరీక్షల్లో క్లీన్‌చీట్‌ వచ్చింది. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. పట్టణ ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో మున్సిపాలిటీ నిరంతరం నీటి నాణ్యతను పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించారు.

రోజుకు కోటి 25 లక్షల లీటర్లు..

మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 13,806 నల్లా కనెక్షన్లు ఉండగా, చీటకోడూరు ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా రోజుకు ోటి 15 లక్షల లీటర్లు, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ద్వారా మరో 10 లక్షల లీటర్లు కలిపి రోజుకు కోటి 25 లక్షల లీటర్ల నీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో అన్ని నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణంలో మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని తాగేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి చూపకుండా, ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పట్టణంలో 100కు పైగా నిబంధనలకు విరుద్ధంగా వాటర్‌ ప్లాంట్లు నడుస్తున్నాయని, వాటి నుంచి సరఫరా అయ్యే నీటిలో అవసరమైన ఖనిజ లవణాలు (మినరల్స్‌) తగిన మోతాదులో లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రమాణాలకు అనుగుణంగా..

పట్టణంలో పురపాలిక ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై నిర్వహించిన తాజా ప్రయోగశాల పరీక్షల్లో అన్ని నీటి నమూనాలు భారతీయ ప్రమాణాల బ్యూరో (ఐఎస్‌ 10500–2012) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలింది. జిల్లా నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల కోసం 2026 జూన్‌ 15న నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌లో టెస్ట్‌ చేయించారు. పట్టణంలోని ధర్మకంచ, చమన్‌, ఆర్డీఓకార్యాలయం, సాయినగర్‌, హౌసింగ్‌ బోర్డు, ఈ–సేవ కేంద్రం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వీవర్స్‌ కాలనీతో పాటు డ్యాం ముడి నీటి నమూనాను కూడా పరీక్షించారు.

నివేదిక ఇలా..

నివేదిక ప్రకారం నీటి ఆమ్ల–క్షార స్థాయి 7.86 నుంచి 8.06 మధ్య నమోదు కాగా, డ్యాం ముడి నీటిలో 8.70గా నమోదైంది. మసకదనం 0.1 నుంచి 0.3 మధ్య ఉండి, అనుమతించిన పరిమితిలోనే ఉంది. నీటిలో మొత్తం కరిగిన ఘన పదార్థాలు 304 నుంచి 329 మిల్లీగ్రాములు ప్రతీ లీటరుకు, మొత్తం క్షారత్వం 32 నుంచి 44 మిల్లీగ్రాములు, మొత్తం కాఠిన్యం 120 నుంచి 165 మిల్లీ గ్రాములు, క్లోరైడ్‌ 85 నుంచి 113 మిల్లీ గ్రాములు, ఫ్లోరైడ్‌ 0.43 నుంచి 0.68 మిల్లీ గ్రాములు, నైట్రేట్‌ 4.1 నుంచి 6.2 మిల్లీ గ్రాములు, సల్ఫేట్‌ 10.45 నుంచి 13.61 మిల్లీ గ్రాములు, ఇనుము 0.05 నుంచి 0.09 మిల్లీ గ్రాముల మధ్య నమోదయ్యాయి. ఇవన్నీ భారతీయ ప్రమాణాల బ్యూరో గరిష్ఠ పరిమితుల కంటే తక్కువగా ఉన్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

మున్సిపల్‌ నీళ్లు నిర్భయంగా తాగొచ్చు

గత నెలలో నీటి నాణ్యత పరీక్షలు

నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణమే: ల్యాబ్‌ టెస్ట్‌ నివేదిక

అవగాహన కల్పిస్తున్న మున్సిపల్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement