జనగామ రూరల్: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఈఓ కార్యాలయ ప్రత్యేక బృందం ప్రతినిధి పద్మావతి సూచించారు. శుక్రవారం జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 254, 259, 270 పోలింగ్ స్టేషన్ బూత్‌ల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఇంటింటి సర్వే, బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న విధులు, ఓటర్లకు అందిస్తున్న అవగాహన పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫారాలను సక్రమంగా నింపేలా అవసరమైన అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే క్రమంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత ఆధారాలతో ధ్రువీకరించి నమోదు చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు. కార్యక్రమంలో జనగామ ఈఆర్‌ఓ, ఆర్డీఓ గోపీరాం, ఏఈఆర్‌ఓ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఘనపూర్ ఈఆర్‌ఓ, ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, ఏఈఆర్‌ఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌ను పరిశీలించిన అబ్జర్వర్
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ పరిశీలకురాలు పద్మావతి శుక్రవారం పరిశీలించారు. ఘన్‌పూర్‌లోని 111, 116వ పోలింగ్‌బూత్‌లలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలతో పరిశీలకురాలు మాట్లాడుతూ.. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందించారా, ఎన్ని ఫారాలు కలెక్షన్ చేసి ఆన్‌లైన్ చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్‌డీఓ కిరణ్‌ప్రకాశ్, తహసీల్దార్ స్వప్న, ఆర్‌ఐ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
సీఈఓ కార్యాలయ ప్రత్యేక బృందం ప్రతినిధి పద్మావతి


