● మొదటిరోజు 55 దాఖలు
● 5 సొసైటీల్లో ప్రారంభంకాని నామినేషన్లు
జనగామ: జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి 12 సహకార సంఘాల పరిధిలో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 5న పరిశీలన, 6న ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా విడుదలతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. అనంతరం 10వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. తొలి రోజు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని ఏడు చేనేత సహకార సంఘాల్లో మొత్తం 55 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే మిగిలిన ఐదు సంఘాల పరిధిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం.
12 సంఘాలు...55 నామినేషన్లు
భారత్ టీసీ జెడ్‌బీ హెచ్‌డబ్ల్యూసీఎస్, జనగామలో 2 నామినేషన్లు పడగా, ప్రాజెక్టు హెచ్‌డబ్ల్యూసీఎస్ జనగామలో–13, శ్రీవెంకటేశ్వర హెచ్‌డబ్ల్యూసీఎస్, కొత్తపల్లిలో–4, హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ గూడూరులో 15, హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ స్టేషన్‌ఘన్‌పూర్‌లో–9, శత్రంజి హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ కంచనపల్లి–10, శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర హెచ్‌డబ్ల్యూసీఎస్ సీతారాంపురం–2 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మార్కండేయ హెచ్‌డబ్ల్యూసీఎస్ బచ్చన్నపేట, శ్రీ సిద్ధేశ్వర సిల్క్ డబ్ల్యూసీఎస్ బచ్చన్నపేట, శ్రీ పద్మవంశీ జీహెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, ఎల్లంల, శ్రీ శ్రీనివాస పవర్‌లూం, డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ వీవర్స్, కొడకండ్ల, శ్రీ భావనరుషి హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, నీర్మాల సొసైటీల పరిధిలో ఐదు చోట్ల మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా రాలేదు.
స్థానిక ఎన్నికలను తలపించే పోటీ
చేనేత సంఘాల ఎన్నికలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా మారనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ప్యానెళ్ల ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, మద్దతు కూడగట్టడం వంటి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. చేనేత సహకార సంఘాలు నూలు, ముడిసరుకు పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి కీలక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. దీంతో ఈ ఎన్నికలపై చేనేత కార్మికుల్లో ఆసక్తి నెలకొంది.
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి నేడు(శుక్రవారం) దరఖాస్తుల స్వీకరణ, 4న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. జూలై 2 నాటికి సివిల్ ఇంజనీరింగ్‌లో ఒకటి, సివిల్ ఇంజినీరింగ్ (రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్)లో 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 2, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 35 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.


