● విత్తనాలు, ఎరువుల కోసం రైతుల దుకాణాల బాట
జనగామ: వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురవక జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటల సాగు కొంత మందగించింది. అయితే ఇటీవల కురుస్తున్న చిరుజల్లులతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వర్షాలు కొనసాగుతాయనే అంచనాతో రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు జిల్లా కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలకు పెద్ద సంఖ్యలో చేరుకుని పత్తి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేస్తు న్నారు. దీంతో కొన్ని రోజులుగా వెలవెలబోయిన దుకాణాలు రైతుల రద్దీతో కళకళలాడుతున్నాయి.


