లింగాలఘణపురం: రాష్ట్రంలో సుధీర్ఘకాలంగా కొనసాగిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రూపు మారింది. దీనిస్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ –గ్రామీణ్) పేరుతో పథకాన్ని అమలుచేస్తుంది. ఇక నుంచి ఈ పథకంలో చేపట్టే పనులకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పని దినాలను కూడా వంద నుంచి 125 రోజులకు పెంచారు.
వామపక్ష పార్టీల పోరాటం వృథా
యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం (పథకం) నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకొనేందుకు పేరు మార్చి భవిష్యత్‌లో కూలీలకు పనులు కల్పించకుండా పోతుందని వామపక్ష పార్టీలు చేపట్టిన పోరాటం వృథా అయింది. జూలై 1 నుంచి పోర్టల్ మార్పు చేశారు. కూలీల మస్టర్‌లను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
జిల్లాలో 1,16,639 జాబ్ కార్డులు
జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా 1,16,639 మంది జాబ్ కార్డు కలిగిన కూలీలు ఉండగా అందులో 2,26,704 మంది కూలీలు ఉన్నారు. రెగ్యులర్‌గా కూలీ పనికి వెళ్లే వారు 1,18,893 ఉన్నారు. వీరంతా ఇక నుంచి వీబీజీ రామ్ జీ పథకం పేరుతో పని చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కూలీలకు మాత్రం ఉపాధి హామీ (కరువు పని) అనే తప్ప పేరు మార్చిన విషయంపై ఏమీ తెలియడంలేదు. రోజు తాము పనికి వెళ్లడం, ఫొటోలు దిగడమే తప్ప ఉపాధి హామీ చట్టం మార్పుపై ఏ మాత్రం అవగాహన లేదు. భవిష్యత్‌లో కూలీ డబ్బుల చెల్లింపు, పనుల కొరత ఏర్పడితే తప్ప తెలిసే పరిస్థితి లేదు.
ఉపాధి కూలీల వివరాలు
ఇక నుంచి వీబీ జీ రామ్ జీగా అమలు
నూతన పోర్టల్‌లో పనుల ఎంట్రీ
జాబ్‌కార్డులు : 1,16,639
కూలీల సంఖ్య : 2,26,704
యాక్టివ్ కూలీలు : 1,18,893
గ్రామాలు : 280
పనికి వెళ్లడం తప్ప.. మాకేం తెల్వదు
కరువు పనికి వెళ్లడం తప్ప ఉపాధి హామీ చట్టం, వీబీజీ రామ్ జీ పేరు మాకు తెల్వదు. కూలీ పనికి వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొనే ఫొటోలే గాని మాకు కొత్త పేరు.. దాంతో వచ్చే నష్టాలు, లాభాలు ఏమీ తెల్వదు.
– బెజ్జం స్వప్న, లింగాలఘణపురం


