బచ్చన్నపేట: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు సర్పంచ్ బేజాడి సిద్దులు, ఉప సర్పంచ్ గొలన్‌కొండ నాగారాజులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక నుంచి గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ. 50 వేల జరిమానా విధిస్తామని, సమాచారం అందించిన వారికి రూ.5 వేల ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కనుకరాజు, రాజు, అబ్బసాని వేణు, బొడిగం కవిత, బేజాడి విజయ, లక్ష్మి, మధు, భవాని, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, బుచ్చిరెడ్డి పలువురు పాల్గొన్నారు.
హక్కుల పరిరక్షణకు
ముందుకురావాలి
జనగామ: బంజారా జాతి మనుగడ, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు ప్రతీ బంజారా ఐక్యంగా ముందుకు రావాలని లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) జిల్లా ఇన్‌చార్జ్ కొర్ర రాజేందర్ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో ఎల్‌హెచ్‌పీఎస్ నంగారాభేరి 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల అమలుపై బంజారా సమాజంలో అసంతృప్తి ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా సంఘటితమై పోరాడాలని సూచించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు వాంకుడోతు అనిత మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఎల్‌హెచ్‌పీఎస్ చేసిన ఉద్యమాలు ఫలించాయన్నారు. ఈ కార్యక్రమంలో నర్మెట మండల అధ్యక్షుడు ధరావత్ రాజు, రఘునాథపల్లి మండల ఇన్‌చార్జ్ సంతోష్, నాయకులు సురేష్, రమేష్, రాజు తదితరులు ఉన్నారు.
వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా లక్ష్మీనారాయణ
జనగామ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి (వైటీడీ) ప్రభుత్వం తొలిసారిగా 18 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. రెండేళ్ల పదవీకాలం ఉన్న ఈ తొలి పాలక మండలిలో జనగామ జిల్లాకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌కు చోటు దక్కింది. మండల స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ క్రమంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి సేవలందిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, ప్రజా సమస్యలపై చురుకై న వైఖరి, నాయకత్వ లక్షణాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ ం ఆయనకు ఈ అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం ప్రతిష్టను మరింత పెంచే దిశగా నావంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానన్నారు.
దరఖాస్తుల గడువు
పొడిగింపు
జనగామ రూరల్: సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్‌రావు బుధవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల (ముస్లిం, మైనార్టీ, బౌద్ధులు, సిక్కులు) వారు విదేశాల్లో చదువుకునేందుకు అర్హత గల అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9951933034, 9346951278 నంబర్లలో సంప్రదించవ్చన్నారు.
అంబేడ్కర్ ఓవర్సీస్‌కు..
అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద విదేశాల్లో ఉన్నత చదువులకు అందించే ఆర్థిక సాయం కోసం అర్హత, ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి బి.విక్రమ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఎస్సీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


