● ఇరిగేషన్ డీఈ అరుణ్‌జ్యోతి
రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ పెద్ద చెరువును ఇరిగేషన్ డీఈ అరుణ్‌జ్యోతి బుధవారం ఏఈ సింధుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అక్రమ నిర్మాణాలపై అగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటి హాల్, పెద్దమ్మగుడి, కొన్ని నివాస గృహాల నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, అవి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. అనంతరం డీఈ మాట్లాడుతూ చెరువు పరిధిలో ఎవరికై న పట్టా భూములు ఉంటే సాగు చేసుకొని జీవనం కొనసాగించాలే తప్ప, శాశ్వత నిర్మాణాలు చేపడితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా చెరువు మత్తడి, తూము మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.13 లక్షలు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పోకల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చింత నరేష్, కారోబార్ యూసఫ్, పండుగ నవీన్, నూనె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


