జనగామ: జీవితంలో కష్టాలు వెంటాడుతున్న ఓ దివ్యాంగుడి కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అండగా నిలిచారు. జీవనోపాధి కోసం సహాయం కోరుతూ వచ్చిన వారి వినతిని సానుకూలంగా పరిశీలించిన కలెక్టర్, కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించేలా టాటా ఏస్ వాహనాన్ని మంజూరు చేయించారు. ఇందుకోసం రూ.4 లక్షల విలువైన చెక్కును మంగళవారం కలెక్టరేట్‌లో పర్శ సాయి తల్లిదండ్రులు లక్ష్మి, సాయి మల్లయ్యకు అందజేశారు. పట్టణానికి చెందిన అంగవైకల్యంతో బాధపడుతున్న పర్శ సాయి కుటుంబం తమ ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ జీవనోపాధి కోసం ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. వారి పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి టాటా ఏస్ వాహనం మంజూరుకు చర్యలు తీసుకోవడం విశేషం. ఈ సం దర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అసలు లక్ష్యం పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమేనన్నారు. కలెక్టర్ అందించిన సాయంపై పర్శసాయి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
డీఎఫ్‌ఓగా ముకుందరెడ్డి
జనగామ: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డీఎఫ్‌ఓ (విజిలెన్‌న్స్–1)గా విధులు నిర్వహిస్తున్న జి.ముకుందరెడ్డి (ఐఎఫ్‌ఎస్–2017)కి పదోన్నతి కల్పిస్తూ హనుమకొండ–జనగామ జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌ఓ)గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు హనుమకొండ–జనగామ డీఎఫ్‌ఓగా పనిచేస్తున్న లావణ్యను మహబూ బాబాద్ జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో జి.ముకుందరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. బదిలీలు, పోస్టింగ్‌లు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
డీడీఎన్ రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి ముగ్గురికి చోటు
జనగామ: ధూప దీప నైవేద్య అర్చక సంఘ(డీడీఎన్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జిల్లా నుంచి ముగ్గురికి చోటు దక్కింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ములుగు రాజలింగ ఆరాధ్య, అధికార ప్రతినిధిగా గంగు శ్రవణ్ కుమార్ శర్మ, కార్యవర్గ సభ్యుడిగా పాగాల సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు.
తక్కువ విస్తీర్ణం నమోదు చేసి ట్రేడ్ లైసెన్స్
జనగామ: పట్టణానికి చెందిన రచ్చ రాజశేఖర్ అనే వ్యాపారి ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో వ్యాపార సంస్థ విస్తీర్ణాన్ని వాస్తవానికి కంటే తక్కువగా నమోదు చేసి లైసెన్స్ పొందినట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. మున్సిపల్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో దరఖాస్తులో నమోదైన వివరాలు, వాస్తవ విస్తీర్ణం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు తేలినట్లు స్పష్టం చేశారు. దీంతో ట్రేడ్ లైసెన్స్ పోర్టల్‌లో తప్పు వివరాలు నమోదు చేసినందుకు నిబంధనల ప్రకారం 25 రెట్లు పెనాల్టీ విధించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తి నుంచి రూ.63,250 జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు. ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే వ్యాపారులు తప్పనిసరిగా సరైన వివరాలనే నమోదు చేయాలని, తప్పుడు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పురపాలిక షెట్టర్ల అద్దె చెల్లించాలి
పురపాలిక షెట్టర్ల అద్దెను బకాయిదారులు వెంటనే చెల్లించాలని కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న షెట్టర్లను ఆయన తనిఖీ చేశారు. మున్సిపల్ నిబంధనలను అనుసరించి అద్దెలు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.


