జనగామ రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారనుంది. దీని స్థానంలో నూతన మార్పులతో వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్– గ్రామీణ్) పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. జూలై 1వ తేదీ నుంచి ఈ పథకం అధికారికంగా అమలులోకి రానుంది. ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందడంతో కేటాయించిన పాత లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ పనులు సాగాయి. జూన్‌లో వర్షాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ కూలీలు పనులకు హాజరవుతూనే ఉన్నారు.
నూతన మార్పులు ఇలా..
● నూతన చట్టం ప్రకారం పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు.
● గతంలో కేంద్రం 100 శాతం నిధులు కేటాయించేది. ప్రస్తుతం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంపై అదనపు భారం పడనుంది.
● గతంలో 263 రకాల పనులకు మాత్రమే అనుమతి ఉండగా, నూతన పథకంలో ఆ సంఖ్యను 318కి పెంచారు.
● గతంలో నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉండే చెరువుల పూడికతీత పనులను ఉపాధి హామీ కింద చేసేవారు. ఇకపై ఆ నిర్వహణ ఖర్చులను నీటిపారుదల శాఖే భరించాల్సి ఉంటుంది.
● గ్రామాల అంతర్గరోడ్డు, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రహదారులు, చెట్ల పెంపకం, భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
● భౌతికంగా కనబడే పనులైన అంగన్‌వాడీ, జీపీ భవనాలు, పాఠశాల ప్రహరీలు, చెక్‌డ్యాంల నిర్మాణాలు, సీసీ రోడ్లు, మురుగు కాలువల వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
నూతన మార్పులతో అమలు కానున్న
ఉపాధి హామీ పనులు
100 రోజుల నుంచి 125లకు పెంపు
పనుల సంఖ్య 318కి పెంచిన కేంద్రం
జిల్లా వ్యాప్తంగా 1,16,127జాబ్ కార్డులు
అమలుకు సిద్ధం
జూలై 1 నుంచి వీబీ జీ రామ్ జీ పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ తగిన సూచనలు చేశారు. పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా సిబ్బందిని సిద్ధంగా ఉంచి గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
–భాస్కర్, డీఆర్‌డీఓ


