● జిల్లా ఆస్పత్రి అభివృద్ధికి కొత్త కమిటీ
● నేడు కలెక్టరేట్‌లో తొలి సమావేశం
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి, వైద్యసేవల నాణ్యత పెంపు, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీ తొలి సమావేశం నేడు(బుధవారం)కలెక్టరేట్ సమావేశం హాల్‌లో జరగనుంది.
కమిటీలో వీరే
కమిటీలో జిల్లా పరిషత్ సీఈఓ, వైస్ చైర్మన్‌గా బి.రంగారావు, వైద్యవిద్య అదనపు సంచాలకుడు డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సభ్యులుగా కొనసాగనున్నారు. అదనంగా మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు, ఇండియన్ మెడిక ల్ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, కాకతీయ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రతినిధులు కమిటీలో ఉన్నారు. ఆస్పత్రి అదనపు డీఎంఈ, సూపరింటెండెంట్ డాక్టర్ వి.రాజలింగం కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
తొలి సమావేశం
తొలి సమావేశంలో ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, అవసరమైన మందుల లభ్యత, ఆధునిక వైద్య పరికరాల సమీకరణ, అదనపు వైద్య సిబ్బంది అవసరం, పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, భవనాల నిర్వహణ, అత్యవసర వైద్య సేవల బలోపేతం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.


