స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నేడు(బుధవారం) నిర్వహించనుండగా పలు అంశాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సన్నద్ధం అవుతున్నారు. గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు సరైన అవకాశం ఇవ్వకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సారి ఎలాగైనా మున్సిపల్ నిధులు, ఖర్చులు, జరుగుతున్న పనులు తదితర అంశాలపై చర్చించాలని బీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సైతం చర్చించుకుంటున్నారు. సమావేశానికి ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరు కానున్నారు.
సమావేశం ఎజెండా
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఎలక్ట్రికల్, అకౌంటెంట్ తదితర విభాగాలపై పలు అంశాలపై ఎజెండాలో చర్చించనున్నారు. శానిటేషన్ విభాగంలో 13వ వార్డులో ఉన్న పాతబావిని పూడ్చుట, మెయిన్ రోడ్డు డ్రెయినేజీలను శుభ్రం చేయుట, కుక్కలు, కోతుల నిర్మూలన, వర్షాకాలం దృష్ట్యా అత్యవసర పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఘన్‌పూర్ శివాజీ చౌక్ వద్ద ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి పక్కన పబ్లిక్ టాయిలెట్స్ కోసం స్థల సేకరణ తదితర అంశాలను చర్చించనున్నారు.


