స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ రిజర్వాయర్‌ను, పంప్‌హౌస్‌ను గోదావరి నదీ యాజమాన్యబోర్డు చైర్మన్ పి.దోర్జీగ్యాంబా ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం సోమవారం సందర్శించి తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లోని నీటి నిల్వ పరిస్థితులు, పంప్‌హౌస్ పనితీరు, సాగునీటికి సంబంధించిన అంశాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి వినియోగం, సాంకేతిక అంశాలపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ప్రధాన ఇంజనీర్ ఆర్.సుధీర్, పర్యవేక్షణ ఇంజనీర్ బి.సీతారాంనాయక్, ఉపకార్యనిర్వహణ ఇంజనీర్ బి.సంపత్‌కుమార్, సహాయ ఇంజనీర్లు సారా, వినోద్, సాయితేజస్విని తదితరులు పాల్గొన్నారు.
4న చికెన్ వేస్టేజీ కొనుగోలు
హక్కులకు టెండర్
జనగామ: మున్సిపాలిటీ పరిధిలో చికెన్ వేస్టేజీ (కోళ్ల వ్యర్థాల) కొనుగోలు హక్కుల కోసం టెండర్ ప్రక్రియను మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. గతంలో రూ.5 లక్షలుగా ఉన్న కనీస టెండర్ విలువను ఈసారి రూ.12 లక్షలకు పెంచుతూ వచ్చే నెల 4వ తేదీన జనగామ పురపాలక కార్యాలయంలో బహిరంగ టెండర్ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. టెండర్‌లో పాల్గొనదలచిన వారు ముందుగా రూ.50 వేల డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. టెండర్ దక్కించుకున్న వ్యక్తి మూడు రోజుల్లో రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉండగా, మరో మూడు నెలల తర్వాత ఒప్పంద మొత్తంలో 25 శాతం, మిగిలిన మొత్తాన్ని మరో మూడు నెలల్లో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. గతంలో చికెన్ వేస్టేజీ టెండర్ల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించడంతో పాటు పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదు పాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ సారి టెండర్ విలువను గతంతో పోలిస్తే సుమారు 125 శాతం పెంచినట్లు కమిషనర్ తెలిపారు.
బతుకమ్మ కుంట సందర్శన
టికెట్ టెండర్లకు ఆహ్వానం
జనగామ: బతుకమ్మ కుంట సందర్శనకు సంబంధించిన టికెట్ విక్రయాల నిర్వహణ కోసం మున్సిపాలిటీ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. టికెట్ విక్రయాల టెండ ర్ విలువను రూ.18 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. బతుకమ్మకుంట సందర్శనకు వచ్చే సందర్శకుల కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రవేశ సమయాన్ని నిర్ణయించారు. గతంలో మాదిరిగానే చిల్ట్రన్ పార్కు ఎంట్రెన్స్‌కు రూ.10, బతుకమ్మకుంటకు రూ.5 ప్రవేశ రుసుం వసూలు చేస్తారు. ఆసక్తి గల వ్యక్తులు, కాంట్రాక్టర్లు నిర్ణీత తేదీన అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాల యానికి హాజరై టెండర్‌లో పాల్గొనాలని కమిషనర్ కోరారు.
పోలీసుస్టేషన్‌లో
డీసీపీ ఆకస్మిక తనిఖీ
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ రాజమహేంద్రనాయక్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల తనిఖీ, సీసీటీవీ రికార్డుల క్రాస్ చెక్ చేశారు. అనంతరం సిబ్బందికి విధి నిర్వహణ, కేసుల విచారణపై సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎస్సై శ్రావణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.


