ప్రజావాణి అర్జీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు సోమవారం అర్జీదారులు పోటెత్తారు. అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 401 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలే ఉన్నాయి. ప్రజలు అందజేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. పెండింగ్ అర్జీలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
● పెంబర్తి గ్రామానికి చెందిన పొన్న హేమలతది పేద కుటుంబం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమకు సొంత ఇల్లు లేక అద్దె భవనంలో ఉంటున్నామని డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు.
● చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన గాజర్ల అరుణ్ చిన్నప్పుడే పోలియో సోకి శారీరం పనిచేయక మంచంకే పరిమితం అయ్యాడు. సదరం సర్టిఫికెట్‌లో 90 శాతంగా నిర్ధారించారు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని పింఛన్ ఇప్పించాలని అరుణ్ తండ్రి మహేందర్ వినతి అందించారు.


