సీపీగా ఎన్‌.శ్వేత | - | Sakshi
Sakshi News home page

సీపీగా ఎన్‌.శ్వేత

Jun 30 2026 1:12 AM | Updated on Jun 30 2026 1:12 AM

సీపీగా ఎన్‌.శ్వేత

2012 బ్యాచ్‌ అధికారికి వరంగల్‌ కమిషనరేట్‌ బాధ్యతలు..

భద్రాద్రి జిల్లాకు డీఐజీగా అదనపు బాధ్యతలు

కమిషనరేట్‌ వస్తున్న తొలి మహిళా అధికారి

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌గా

సన్‌ప్రీత్‌సింగ్‌ బదిలీ

క్రైం డీసీపీగా ఎస్పీ(ఎన్‌సీ) కిషన్‌ సింగ్‌ నియామకం

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా ఎన్‌.శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ నార్త్‌ రేంజ్‌ జాయింట్‌ కమిషనర్‌ (లాఅండ్‌ఆర్డర్‌)గా ఉన్న ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వరంగల్‌ సీపీగా పనిచేసిన సన్‌ప్రీత్‌ సింగ్‌ను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ విభాగానికి జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. శ్వేత తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా ఎస్పీ, డీసీపీగా పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. సమర్థవంతమైన అఽధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రధానంగా మహిళల భద్రత, నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతారన్న పేరుంది. వరంగల్‌ సీపీ బాధ్యతలతోపాటు భద్రాద్రి జోన్‌–4 డీఐజీగా కూడా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

తొలి మహిళా కమిషనర్‌..

వరంగల్‌ కమిషనరేట్‌ ఏర్పాటైనప్పటినుంచి అంతా పురుషులే సీపీగా నియమితులయ్యారు. 2012 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్వేత వరంగల్‌ కమిషనరేట్‌కు నియమితులైన తొలి మహిళా కమిషనర్‌. ఆమె సిద్దిపేట ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ ఉత్తర మండల డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (డీసీపీ)గా పనిచేస్తూ నేర నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో భేష్‌ అనిపించుకున్నారు.

16 నెలలకే సన్‌ప్రీత్‌ సింగ్‌ బదిలీ..

ఇప్పటివరకు పనిచేసిన సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ 16 నెలల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. 2025, మార్చి 8న ఆయన వరంగల్‌ కమిషనరేట్‌కు సీపీగా వచ్చారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా తగ్గలేదన్న పేరుంది. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఫోన్‌లో పరస్పరం గొడవ పడ్డారన్న ప్రచారం ఉంది.

క్రైమ్స్‌ డీసీపీగా కిషన్‌ సింగ్‌...

వరంగల్‌ కమిషనరేట్‌ క్రైం డీసీపీగా డి.కిషన్‌ సింగ్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన టీజీ–ఐసీసీసీ టెక్నికల్‌ విభాగంలో నాన్‌ కేడర్‌ ఎస్పీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement