● ‘ప్రజాపాలన’ జిల్లా ప్రత్యేక అధికారి కమిషనర్ శ్రీదేవసేన ● 99 రోజుల కార్యాచరణ అమలుపై జిల్లా స్థాయి సమీక్ష
జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమగ్ర అభివృద్ధికి దోహదపడిందని, ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు చేరాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలో 99 రోజుల కార్యాచరణ అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారికి వివరించారు. అనంతరం ప్రత్యేక అధికారి శ్రీదేవసేన మాట్లాడుతూ.. ప్రజాపాలన స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, గ్రామాలు, పట్టణాల్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న అన్‌అకాడమీ తరగతులు పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేశామని తెలిపారు.
ఫొటోల ప్రదర్శన
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయాలను సూచించేలా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ జిల్లా ప్రత్యేక అధికారి దేవసేన తిలకించారు. ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం అభినందనీయమని శ్రీదేవసేన అన్నారు. ప్రజలకు మరింత చేరువ చేసేలా ఇటువంటి ఫొటో ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.


