జనగామ రూరల్: ప్రతీ ఐదేళ్ల లోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జాతీయ ఆరోగ్య మిషన్ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని పోలియో కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్రాలకు రాలేని చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


