రేపు రైతు భరోసా నిధుల విడుదల | - | Sakshi
Sakshi News home page

రేపు రైతు భరోసా నిధుల విడుదల

Jun 29 2026 1:05 AM | Updated on Jun 29 2026 1:05 AM

జిల్లాకు రూ.233.69 కోట్లు

జనగామ: జిల్లా రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వానాకాలం రైతు భరోసా పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. ముఖ్యంగా తొలి విడతలో ఒక ఎకరం, రెండు ఎకరాలు, మూడు, నాలుగు, ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే నగదు జమ చేస్తారా లేక అర్హులైన రై తులకు ఒకేసారి నిధులు విడుదల చేస్తారా అనే అంశంపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా అధికారిక స్పష్టత రాకపోవడంతో రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మండలాల వారీగా కేటాయింపులు

జిల్లాలో పాలకుర్తి మండలం అత్యధిక లబ్ధిదారులతో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 23,624 మంది రైతులకు రూ.29.56 కోట్లు కేటాయించారు. రఘునాథపల్లి మండలంలో 21,585 మందికి రూ.27.44 కోట్లు, బచ్చన్నపేట మండలంలో 18,718 మందికి రూ.24.50 కోట్లు, దేవరుప్పుల మండలంలో 17,720 మందికి రూ.22.57 కోట్లు, జనగామ మండలంలో 17,041 మందికి రూ.20.59 కోట్లు జమ చేయనున్నారు. స్టేషన్‌ఘనపూర్‌, లింగాలఘణపురం, చిల్పూర్‌, జఫర్‌గఢ్‌, నర్మెట, కొడకండ్ల మండలాలకు కూడా అత్యధిక మొత్తంలో నిధులు కేటాయించారు. తరిగొప్పుల మండలంలో అత్య ల్పంగా 8,509 మంది రైతులకు రూ.10.38 కోట్లు విడుదల కానున్నాయి.

ఐదు ఎకరాల వరకే మొదటి విడత?

రైతుల్లో ప్రస్తుతం ప్రధాన చర్చ ఇదే. గతంలో ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇస్తామని పలుమార్లు ప్రకటించింది. దీంతో తొలి విడతలో ఐదు ఎకరాల లోపు రైతులకే నిధులు జమ చేసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఒకేసారి నిధులు జమ చేస్తారని మిగతా వారు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలతోనే పూర్తి స్పష్టత రానుంది.

వర్షాభావంతో సాగు నెమ్మదింపు

జిల్లాలో వానాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో సాగు పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు వరి, పత్తి కలిపి సుమారు 10 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. మొక్కజొన్న, పెసర్లు, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలు కూడా పరిమితంగానే సాగవుతున్నాయి. మరోవైపు సుమారు రెండు లక్షల ఎకరాల్లో రైతులు భూములు సిద్ధం చేసి, దుక్కులు దున్ని, నారుమడులు పోసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పత్తి విత్తిన ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా మొలకలు ఎండిపోవడంతో రైతులు రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విత్తనాలు, కూలీల ఖర్చు రెండింతలు అవుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాకు రూ.233.69కోట్ల కేటాయింపు

1.88 లక్షల మంది రైతులకు లబ్ధి

తొలి విడతలో ఎన్ని ఎకరాలకు?

వర్షాభావంతో సాగు మందగింపు..

రైతు భరోసాపై ఆశలు

జిల్లాలోని 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,88,765 మంది అర్హులైన రైతులకు రూ.233.69 కోట్ల రైతు భరోసా కేటాయించారు. మండలాల వారీగా అర్హుల జాబితా, బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలన పూర్తి చేశారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం, ఈ–కేవైసీ వంటి ప్రక్రియలు పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement