జనగామ రూరల్: ప్రజల కష్టాలను తీర్చేలా సాహిత్య సృజనాత్మకత ఉండాలని, యువతను సాహిత్యం వైపు మళ్లించాలని సౌదామని సాహిత్య సంస్థ అధ్యక్షుడు చింత ప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కవులు, కళాకారుల ఐక్యవేదిక జనగామ అధ్యక్షుడు జి.కృష్ణ అధ్యక్షతన సాహితి సంస్థ ప్రారంభోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భాషా సంస్కృతీ సంప్రదా యాలను పరిరక్షించడమే ధ్యేయంగా కామారెడ్డిగూడెం కేంద్రంగా పోరాటాల గడ్డపై సౌదా మని సాహిత్య సంస్థ ఆవిర్భవించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అంకాల సోమయ్య, కోశాధికారి జోగు సుదర్శన్, కార్యవర్గ సభ్యుడు జోగు సుధాకర్, మసురం రాజేంద్రప్రసాద్, లగిశెట్టి ప్రభాకర్, పానుగంటి రామమూర్తి, పెట్లోజు సోమేశ్వరాచారి, మామిండ్ల అంజయ్య, ప్రసాద్, యాదగిరి, నరహరి తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా బకాయి పడిన ఐదు విడతల కరువు భత్యాన్ని తక్షణమే విడుదల చేయాలని, పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా పాత కరువు భత్యాలు తప్ప ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏలు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. పీఆర్‌సీ ఈ ఏడాది జూలై వస్తే మూడు సంవత్సరాలు అవుతుందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి డీఏ, పీఆర్‌సీని అందించాలన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాష్, చిక్కుడు శ్రీనివాస్, కృష్ణ, శ్రీనివాస్, శ్రీహరి, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, బాలకృష్ణ, దేవ్‌సింగ్ పాల్గొన్నారు.
వార్డు సభ్యురాలి నిజాయితీ
చిల్పూరు: మండలంలోని మల్కాపూర్ గ్రామ 7వ వార్డు సభ్యురాలు బోగం షర్మిలకు దొరికిన బంగారు పుస్తెలను బాధితురాలికి అందజేసి నిజాయితీ చాటుకున్నారు. గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు షర్మిల టీ స్టాల్ ఏర్పాటు చేసుకుంది. రెండు రోజుల క్రితం రాజు–రేణుక అనే దంపతులు టీ తాగి వెళ్లిపోయారు. షర్మిళ షాపు శుభ్రం చేస్తుండగా పొట్లం లాంటిది కనిపించింది. విప్పిచూడగా బంగారు పుస్తెలు ఉన్నాయి. టీ తాగిన వారి వివరాలు తెలియకపోవడంతో భర్త బొగం సతీష్‌తో కలిసి సర్పంచ్ ఎడవెళ్లి లావణ్యమల్లారెడ్డి, ఉప సర్పంచ్ పసుల వెంకటేశ్వర్లుకు విషయం తెలిపారు. ఆదివారం బాధితులు వచ్చి అడుగగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక మండలి సభ్యుల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్ బంగారాన్ని అందజేశారు.
నేటి నుంచి
కేయూ బీఫార్మసీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసీం ఇక్బాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు.


