● వర్షాభావం..విలవిల్లాడుతున్న రైతాంగం
● పత్తి, వరి సాగుపై తీవ్ర ప్రభావం
● వానల కోసం రైతుల ఎదురుచూపులు
● మళ్లీ విత్తనాల భారం, నార్లు ఆలస్యం
జనగామ: జిల్లాలో వానాకాలం(ఖరీఫ్) సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జిల్లాలోని మండలాల్లో వర్షాభావం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాగునీటి వనరులు ఉన్న రైతులు బోర్లు, డ్రిప్, స్ప్రింక్లర్లతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, వర్షంపై ఆధారపడ్డ రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
మండలాల్లో ఇలా..
జనగామ మండలంలో గతంలో సన్న రకాల వరికి బోనస్ ఆశించిన రైతులు ఈసారి ఎక్కువగా దొడ్డురకం వరిని ఎంచుకున్నారు. అయితే వర్షాలు లేకపోవడంతో నార్లు వేసినా నాట్లు ఆలస్యం కానున్నాయి. బోర్లలో నీరు తగ్గడం, విద్యుత్ సరఫరా అంతరాయం పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. జఫర్‌గఢ్ మండలంలో రైతులు ఇంకా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. బోర్ల కింద సాగు చేసిన పత్తి, మొక్కజొన్న పంటలకు పైపులు, స్ప్రింక్లర్ల ద్వారా నీరు అందిస్తూ ప్రాణం పోస్తున్నారు. నర్మెట, పాలకుర్తి మండలాల్లో 25 నుంచి 30 శాతం వరకు మాత్రమే పత్తి విత్తనాలు విత్తగా, సగానికి పైగా మొలకెత్తలేదు. వరి నార్లు కూడా పరిమితంగానే పోశారు. లింగాలఘణపురంలో మొలక దశలోనే భూమిలో ఉన్న పత్తి గింజలను రైతులు స్ప్రింక్లర్లతో తడిపి కాపాడుతున్నారు. స్టేషన్‌ఘన్‌న్‌పూర్‌లో జూన్ తొలి వారంలో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి రెండో సారి విత్తుతున్నారు. దీంతో ఎకరాకు వేల రూపాయల అదన పు భారం పడుతోంది. వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొడకండ్ల మండలంలో మాత్రం జూన్ రెండో వారంలో పడిన జల్లులతో విత్తిన పత్తి ఎక్కువగా మొలకెత్తగా, తాజాగా కురిసిన వర్షం రైతులకు కొంత ఊరటనిచ్చింది. అయినప్పటికీ జిల్లా మొత్తంగా చూస్తే ఖరీఫ్ సాగు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సమృద్ధిగా వర్షాలు కురియకపోతే నార్లు, విత్తులు మురిగిపోయి, పెట్టుబడులు, దిగుబడుల తగ్గుదలతో రైతుల ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో భూగర్భ జలాలు
ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.37 మీటర్ల లోతులో ఉన్న నీటి జాడలు, మే నెలకు వచ్చేసరికి 7.78 మీటర్ల మేర పెరిగింది. ప్రస్తుతం వానాకాలం సాగు పనులు మొదలు కావడం, ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో జూన్ మొదటి వారం నుంచి పత్తి విత్తులు, వరి నార్లు, నాట్ల కోసం సాగునీటి వినియోగం పెరగడంతో కొంతమేర తగ్గుముఖం పట్టాయి.
జూన్ లో
మే లో
కురియాల్సింది
31.1 (మి.మీ)
కురియాల్సింది 108.9
కురిసింది 53.3
కురిసింది
4.2 (మి.మీ)
తేడా 51.1 శాతం
తేడా 86.5 శాతం
వరణుడు కరుణిస్తేనే సాగు
రెండు ఎకరాల్లో వరి సాగు కోసం 25 రోజుల క్రితం నార్లు పోసిన. పొలాలు దున్నాలంటే మడులు తడిసే పరిస్థితి లేదు. కరెంటు కూడా ఇప్పుడు పది గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఆ ఇచ్చే పది గంటల్లో ఏదో ఒక సాంకేతిక లోపమని రెండు మూడు గంటలు తీసేస్తున్నారు. అటు వర్షాలు లేక ఇటు కరెంటు సరిగా రాక బోర్లు నడవక ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు వర్షం పడుతుందా, బోర్లలో నీటి మట్టం పెరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం.
–శంకర్, రైతు, గానుగుపహాడ్, జనగామ
వానొస్తేనే పెట్టుబడులు
రెండున్నర ఎకరాల్లో పత్తి విత్తనం వేసిన. నెల దాటినా సరైన వాన పడలే. గింజ భూమిలోనే ఉండిపోయింది, మొలక రాలే. ఇక లాభం లేదని స్ప్రింక్లర్లు పెట్టి తడి ఇస్తున్నా. ఎకరాకు వేల రూపాయలు అదనపు ఖర్చు అవుతోంది. వాన దేవుడు కరుణించకపోతే పెట్టుబడి కూడా రాదు.
–సోమిరెడ్డి వీరారెడ్డి, రైతు, లింగాలఘణపురం
భారీ వర్షం కురిస్తేనే గాని బతుకుతెరువు లేదు
మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తేనే కానీ బతుకు లేదు. నాకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి విత్తనం వేయగా, కొంతమేర మొలకెత్తింది. మిగిలిన పత్తి విత్తుల కోసం బావి నుంచి కాలువలు చేసి సాగునీరు మళ్లిస్తున్నా. ఎకరం మేర పత్తి విత్తులు నేటికీ మొలకెత్తలేదు.
–బనక అంజయ్య, రైతు,నర్మెట


