బాల్యవివాహాల రహిత దేశంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల రహిత దేశంగా ఉండాలి

Jun 28 2026 2:38 AM | Updated on Jun 28 2026 2:38 AM

లింగాలఘణపురం: భారత్‌ బాల్య వివాహాల రహిత దేశంగా ఉండాలని జనగామ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.శశి అన్నారు. శనివారం మండలంలోని మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా పాఠశాలల్లో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సివిల్‌ జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రవీందర్‌, ఎస్సై శ్రావణ్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, స్పెషల్‌ ఆఫీసర్‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు

నర్మెట: దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, వారిలో మనోధైర్యాన్ని నింపే బాధ్యత అందరిపై ఉందని అదనపు డీఆర్డీఏ (ఐకేపీ) నూరొద్దీన్‌ అన్నారు. హెలెన్‌ కెల్లర్‌ జయంతిని పురస్కరించుకుని ఎన్‌హెచ్‌సీలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. హెలెన్‌ కెల్లర్‌ తనలోని లోపాలను అధిగమించి దివ్యాంగుల కోసం జీవితాన్నే ధారపోశారని కొనియాడారు. మన గ్రామం ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు ఏరువ విన్సెంట్‌ రెడ్డి, ఫిజియోథెరపీ టేబుల్‌ను సెంటర్‌కు బహుకరించారు. నర్మెట, తరిగొప్పుల, చిల్పూర్‌ ఏపీఎంలు బొడ్డు ప్రమీల, కె.నాగేశ్వర్‌రావు, పి.నరేందర్‌, మండల సమాఖ్యల అధ్యక్షులు మమత, శ్వేతారాణి, మంజుల, సీసీలు కనకరాజు, శంకరయ్య, ఉమ, శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు,

సంక్షేమ గురుకుల కళాశాల సందర్శన

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ శివారు పల్లగుట్ట క్రాస్‌రోడ్డు సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో మాట్లాడారు.. మరుగుదొడ్ల సమస్య ఉందని మున్సిపల్‌ చైర్మన్‌కు ప్రిన్సిపాల్‌ తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రఘుపతి, పీడీ శ్రీనివాస్‌, నాయకులు నీల సోమన్న, గాండ్ల రాజు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

18నుంచి తృతీయ పుష్కర వేడుకలు

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రం బాణాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తృతీయ పుష్కర వేడుకలు జూలై 18 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న సందర్భంగా 20వ తేదీన కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కృష్ణమాచార్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కవులు సమతామూర్తి రామానుజుల గురించి కవితలు రాసి జూలై 15వ తేదీలోగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో అందజేయాలని కోరారు. ఉత్తమ కవితలుగా ఎంపికై న ముగ్గురు కవులకు చిన్నజీయర్‌ స్వామితో ప్రత్యేక పురస్కారం ఉంటుంటున్నారు. ఈ సందర్భంగా జూలై 18 శనివారం సాయంత్రం శ్రీ విష్వక్సేనారాధనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 19న సంతానార్థులకు వివాహ ఆరోగ్యం కోసం శ్రీ వైనతేయయిష్టి శ్రీ స్వామివారిచే మంత్రోపదేశములు, 20న వృద్ధ దంపతి ఆరాధన, సాయంత్రం 6 గంటలకు కవిసమ్మేళనంలో కవులు శ్రీ భగవత్‌ రామానుజుల వైభవాలపై కవితా గానం చేస్తారన్నారు. 21న సుదర్శనేష్టి, శ్రీ సుదర్శన పెరుమాళ్ల ఆరాధన. సాయంత్రం నరసింహారావు బృందం చే భరతనాట్య ప్రదర్శన ఉంటుందన్నారు. 23న గురువారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మహా పూర్ణాహుతి, శాంతి కల్యాణం ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement