నేడు పల్స్‌ పోలియో | - | Sakshi
Sakshi News home page

నేడు పల్స్‌ పోలియో

Jun 28 2026 2:38 AM | Updated on Jun 28 2026 2:38 AM

ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ

జిల్లా వ్యాప్తంగా 293 సెంటర్లు 16 మొబైల్‌ బృందాలు

జనగామ రూరల్‌: జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగిలి పోయిన చిన్నారులకు 29, 30వ తేదీన సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారు. పల్స్‌ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు 48,493 మంది చిన్నారులు ఉన్నారు.

293 పోలియో బూత్‌ల 16 మొబైల్‌ బృందాలు

పోలియో కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 293 పోలియో బూత్‌లు, 16 మొబైల్‌, 16 ట్రాన్సిట్‌ బృందాలు ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, బూత్‌ స్థాయి వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛంద సేవకులు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లి చిన్నారుల వివరాలు సేకరించనున్నారు. ముఖ్యంగా వలస కూలీలు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారి ంచి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకో నున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాన్సిట్‌ బృందాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు.

విజయవంతం చేయాలి

జిల్లా వ్యాప్తంగా ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పనిచేసి ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.

–సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి

బచ్చన్నపేట : ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది విద్యేనని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మండల కేంద్రంలోని పాఠశాలను శనివారం కలెక్టర్‌ సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న అన్‌అకాడమీ తరగతులను ప్రారంభించారు. అలాగే వంటశాల, భోజన నాణ్యత, పారిశుద్ధ్యం, విద్యార్థుల వసతి, తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ 15 రోజులకు స్లిప్‌ టెస్ట్‌, మాక్‌ టెస్ట్‌ తప్పనిసరి అని, విద్యా పాఠ్య ప్రణాళిక ప్రకారమే బోధన జరగాలని, ఫాస్ట్‌ మ్యాథ్స్‌తో గణితంపై భయాన్ని అధిగమించాలన్నారు.

ఎన్యుమరేషన్‌ ఫారాల పరిశీలన..

మండల కేంద్రంలో జరుగుతున్న ‘సర్‌’ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాలను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పరిశీలించారు. బీఎల్‌ఓల పని తీరును పర్యవేక్షించి వారికి సూచనలు చేశారు. సందర్శనలో ఆర్డీఓ గోపీరాం, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్‌, జీసీడీఓ గౌసియా బేగం, కేజీబీవీ ప్రత్యేక అధికారి నారమల్ల గీత, తహసీల్దార్‌ హుస్సేన్‌, ఎంఈఓ ఇర్రి వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ నర్సింగారావు, ఆర్‌ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement