జనగామ రూరల్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల తెలంగాణ పర్యటన చేస్తున్నారని, ఈనెల 29న జనగామ నుంచి హనుమకొండకు చేరుకుంటారని, జనగామ చౌరస్తాలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలకాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బల్ల శ్రీనివాస్, బొజ్జపల్లి సుభాష్, తోకల ఉమారాణి, మహిపాల్, గాజుల సంపత్, పెద్దోజు జగదీష్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రవీంద్రభారతిలో
స్పందన గ్రూపు ప్రతిభ
పాలకుర్తిటౌన్ (దేవరుప్పుల): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వ 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారిణి గడ్డం స్పందన మహిళా గ్రూపు శుక్రవారం బోనాల విశిష్టతను తెలిపేలా ప్రతిభ చాటారు. ఆ శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ప్రము ఖ కవి నందిని సిద్ధారెడ్డి తదితరులు గ్రూపు సభ్యులను సత్కరించి అభినందించారు.
‘సాక్షి’ వార్తలతో
విద్యార్థులకు ప్రోత్సాహం
జనగామ: వేసవి సెలవుల్లో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘సాక్షి వేసవి వికాసం’ పేరిట చిత్రలేఖనం, విహారయాత్రల కబుర్లు, అమ్మమ్మ–నానమ్మ ముచ్చట్లు, నేను గీసిన బొమ్మ, మాబడి ఇలా అనేక అంశాలపై విద్యార్థుల ఫొటోలతో కూడిన కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో నర్మెట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’లో తమ పాఠశాలకు సంబంధించి ప్రచురితమైన కథనాలను ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించి బ్లాక్‌బోర్డుపై ఏర్పాటు చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రదర్శించిన ఈ ఫ్రేమ్‌ల ద్వారా సాక్షి పత్రిక విద్యార్థులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించారు.
డయాలసిస్‌కు వస్తే ప్రాణం మీదకొచ్చింది!
● సిబ్బంది నిర్లక్ష్యంతో పేషెంట్‌కు
తీవ్ర రక్తస్రావం
● హనుమకొండకు తరలించిన
కుటుంబ సభ్యులు
● ఏరియా ఆసుపత్రిలో ఘటన
జనగామ రూరల్: ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన సాంబరాజు అంజయ్య ప్రాణం మీదకు వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 10 రోజుల క్రితం వరంగల్ కేఎంసీలో డయాలసిస్ చేయించుకోని ఇంటికి వచ్చాడు. డయాలసిస్ గడువు రావడంతో గురువారం సాయంత్రం 6 గంటలకు జిల్లా ఏరియా ఆసుపత్రిలోని సెంటర్‌కు వెళ్లాడు. డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో సెట్ చేసి ఉన్న మిషనరీలతో నర్సులు డయాలసిస్ ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత పేషెంట్‌కు చెమట రావడంతో ఇంజక్షన్ వేయగా కుదురుకోగా బెడ్‌షీట్ వేసి డయాలసిస్ మళ్లీ ప్రారంభించారు. కొంత సమయానికి డయాలసిస్ ఊడిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా డ్యూటీ డాక్టర్ లేరని కేఎంసీకి తీసుకెళ్లాలని చెప్పారు. చేసేది ఏమిలేక అంజయ్యను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రక్తం 7 శాతం ఉండాల్సి ఉండగా 2 శాతం పోయిందని డయాలసిస్ కోసం వస్తే ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు.


