జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కోటి నుంచి కోటిన్నర వరకు నగదు రహిత ప్రమాద బీమాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం గొప్ప విషయమని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నగదు రహిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ 16 బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం హర్షణీయమన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు అదనంగా ఒక గంట పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ సెక్రటరీ కొర్నిలియస్, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేర్వారం ప్రభాకర్, జిల్లా కోశాధికారి హఫీజ్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


