‘సర్‌’ షురూ | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ షురూ

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

జనగామ: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ఓటరు నమోదు కార్యక్రమం గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. మొదటి రోజు బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ వెళ్లి 2002 సెన్సెస్‌ ఆధారంగా ఓటర్ల గణన, సవరణ పత్రాలను అందజేశారు. ఒక్కో ఓటరుకు రెండు దరఖాస్తు ఫారాలు ఇస్తుండగా, పూర్తి చేసిన ఒక ఫారం బీఎల్‌ఓ సంతకంతో ఓటరు వద్దే ఉంచుతారు. మరో ఫారాన్ని బీఎల్‌ఓలు తీసుకుంటారు. రోజుకు 30 నుంచి 50 ఫారాలు అందజేయనుండగా, ఇంట్లో ఎవరూ లేకపోతే 3 నుంచి 4 రోజులపాటు మళ్లీ వెళ్లి ఇస్తారు. ఫారం ఇచ్చిన వెంటనే యాప్‌లో పేరు సబ్మిట్‌ చేస్తే రెడ్‌ నుంచి ఆరెంజ్‌ కలర్‌లోకి మారి, ఎవరికి ఇచ్చామో సులువుగా తెలుస్తుంది.

మొదటి రోజే సవాళ్లు

జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ, బీఎల్‌ఓలకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. జిల్లాలో ఇతర జిల్లాల్లో కలిసిన మండలాలను కలుపుకుని మొత్తం 7,67,484 మంది ఓటర్లు ఉండగా, అందులో 7,17,029 మంది ఓటర్లు ఇప్పటికే మ్యాప్‌ అయ్యారు. ఇంకా 50,455 మంది ఓటర్లు అన్‌మ్యాప్‌డ్‌గా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేస్తున్న బీఎల్‌ఓలను ఓటర్లు అనేక సందేహాలతో ప్రశ్నించడం కనిపించింది. ఎన్యుమరేషన్‌ అప్లికేషన్‌ ఫారంపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఫారం ఎందుకు, మాకు ఇందిరమ్మ ఇళ్లు వస్తాయా, పెన్షన్లు మంజూరు అవుతాయా అంటూ ప్రజలు బీఎల్‌ఓలను ఒకటికి రెండుసార్లు ప్రశ్నించారు. దీనికి బీఎల్‌ఓలు ఇది సంక్షేమ పథకాల కోసం కాదని, కేవలం ఓటరు నమోదు, సవరణ, ధ్రువీకరణ ప్రక్రియ కోసమేనని స్పష్టం చేస్తూ వివరించారు. దీంతో చాలా చోట్ల ఓటర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమస్యలు వింటూ

ఈ సర్వే కార్యక్రమం కోసం గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లను బీఎల్‌ఓలుగా నియమించారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో అనుభవం తక్కువగా ఉండ టం, కొందరు పాతతరం ఉద్యోగులు కావడం వల్ల యాప్‌ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తాయి. ఫారాలు నింపడం, వాటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం వంటి ప్రక్రియల్లో శిక్షణ ఇచ్చినా అమలులో మాత్రం సమస్యలు కనిపించాయి. ముఖ్యంగా అంగన్‌వాడీ టీచర్ల వద్ద ఉన్న పాత సెల్‌ఫోన్లలో స్టోరేజీ నిండిపోవడం, యాప్‌ సరిగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రభుత్వం నుంచి కొత్త ఫోన్లు ఇవ్వాలని పలువురు అంగన్‌వాడీ టీచర్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్యుమరేషన్‌ పనిలో సహాయంగా ఒక్కో బృందానికి ఒక అటెండెంట్‌ను కేటాయిస్తే పని వేగవంతం అవుతుందని బీఎల్‌ఓలు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద మొదటి రోజు సర్వే కార్యక్రమం జిల్లాలో ప్రశాంతంగా సాగగా, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షించారు.

సర్‌ ఫారంలోని మూడు కేటగిరీలు..

ఓటర్లకు ఏమిటి అర్థం?

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)లో ఫారాన్ని మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించడం వెనుక ఉద్దేశం ఓటర్ల గుర్తింపును సులభతరం చేయడమే. మొదటి కేటగిరీ 2002 ప్రత్యేక సవరణ జాబితాలోనే పేరు ఉన్న ఓటర్ల కోసం. వీరు 2002 జాబితాలోని అసెంబ్లీ, పార్ట్‌, సీరియల్‌ నంబర్లను నమోదు చేస్తే సరిపోతుంది. రెండో కేటగిరీ ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్నా, 2002లో ఓటు హక్కు వయస్సు రాని వారు లేదా అప్పటికి కొత్త తరం ఓటర్ల కోసం. వీరు తల్లిదండ్రులు లేదా తాతమ్మల 2002 ఓటరు వివరాలను ఆధారంగా చూపించి తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మూడో కేటగిరీలో ప్రస్తుతం జాబితాలో పేరు ఉన్నా, 2002 జాబితాలో తమది గానీ, కుటుంబ సభ్యులది గానీ లింక్‌ దొరకని వారు వస్తారు. వీరికి ఇతర గుర్తింపు పత్రాలు, నివాస ఆధారాలు కీలకం అవుతాయి. మొత్తంగా ఈ మూడు కేటగిరీలు పాత, ప్రస్తుత జాబితా మధ్య లింక్‌ ఏర్పరచి నకిలీ, డూప్లికేట్‌, అనుమానాస్పద ఎంట్రీలను గుర్తించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.

జిల్లా ఓటర్ల సమాచారం:

ఓటర్లు : 7,67,484

మ్యాప్‌ చేసిన ఓటర్లు : 7,17,029

అన్‌మ్యాప్‌డ్‌ ఓటర్లు : 50,455

పోలింగ్‌ కేంద్రాలు : 865

బీఎల్‌ఓలు : 865

జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమం

ప్రారంభం

ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేసిన బీఎల్‌ఓలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement