జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎప్‌సెట్–2026 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈనెల 22 నుంచి 25(గురువారం) వరకు 4 రోజులు వరకు ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సి పాల్ కె.శ్రీనివాస్ తెలిపారు. 980 మందికి పైగా విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టామన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ బి.ఎన్.సురేఖ, వెరిఫికేషన్ ఆఫీసర్ రవీందర్ నాయక్, సిస్టం అడ్మినిస్ట్రేషన్, కరుణాకర్, ఎ.కల్పన, కుమారస్వామి, డి.సరోజ, వై.కళావతి, సుజాత పాల్గొన్నారు.
వెల్ది మోడల్ స్కూల్, కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
రఘునాథపల్లి: మండలంలోని వెల్ది మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. అర్హులైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పాఠశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికల కోసం కూడా కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మోడల్ స్కూల్‌లో కొత్తగా ఏసీఈ గ్రూపును ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.
ఇంగ్లిష్ పీజీటీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
మండలంలోని వెల్ది మోడల్ స్కూల్‌లో తాత్కాలిక (గంటల ప్రాతిపాదికన) పీజీటీ ఇంగ్లిష్ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు బోధించేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలన్నారు. అనుభవం కలిగిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నటు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 29న పాఠశాల ప్రాంగణంలో డెమో క్లాస్, ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల తమను సంప్రదించాలని ఆయన సూచించారు.
వన్యప్రాణులపై అవగాహన
ఖిలా వరంగల్: మామునూరు టీజీ ఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వన్యప్రాణుల సంరక్షణ సంస్థ, సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ (సీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో వైల్డ్ సురక్ష పేరుతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ కమాండెంట్ బాలయ్య హాజరై మాట్లాడారు. వన్యప్రాణుల ప్రవర్తన, వాటి వల్ల మానవాళికి తలెత్తే సంఘర్షణలు, వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా వంటి కీలక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఏసీ రాజేందర్, ఆర్‌ఐలు రవి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, కృష్ణ, సురక్ష త్రివేణి, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్‌చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
కల్యాణం.. కమనీయం
రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాథచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


