● అదనపు డీఆర్డీఓ నాగ శేషాద్రిసూరి
నర్మెట: వీఓ భవన నిర్మాణాలను ఈ నెల 30లోగా ప్రారంభించాలని అదనపు డీఆర్డీఓ నాగ శేషాద్రిసూరి సూచించారు. మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన మండల సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. జూలై 1 నుంచి ఉపాధి హామీ పథకం పేరు జీరాంజీగా మారుతుందని ఈలోగా భవన నిర్మాణాలు చేపట్టాలని ఒక్కో నిర్మాణానికి రూ.10లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. మండలానికి 8 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు మంజూరయ్యాయని, ఒక్కో దానికి రూ.3 లక్షలు, సోక్‌పిట్స్ మండల కేంద్రానికి రెండు, ప్రతీ జీపీకి ఒకటి నిర్మాణాలు చేపట్టాలని ఒక్కో దానికి రూ.92 వేలు చెల్లించబడతాయని, త్వరితగతిన పనులు ప్రారంభించాలని అన్నారు. తాము చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని సర్పంచ్‌లు గోపగోని శ్రీధర్‌గౌడ్, పగిడిపాటి రాజు, రమేష్, శంకర్ నాయక్ సభ దృష్టికి తీసుకురాగా పనుల వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాలని ఎంపీఓ ఉప్పుగల్ల సంపత్ కుమార్ సూచించారు. డీటీ కురికాల వేణు, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, వైద్యాధికారి సుకన్య ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. సర్పంచ్‌లు బొలగాని రేఖ, బాలాజీ, బుజ్జమ్మ, అరుణ, చిన్నపురెడ్డి, పంచాయతీ కార్యదర్శలు పాల్గొన్నారు.


