నాణ్యతగా, రుచికరంగా! | - | Sakshi
Sakshi News home page

నాణ్యతగా, రుచికరంగా!

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

జనగామ రూరల్‌: విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, మధ్యలో మానేయకుండా విద్యార్థుల డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అయితే ఈ మధ్యాహ్న భోజనం ఈసారి మరింత భద్రంగా అమలు చేయాలని ప్రభుత్వం జిల్లా విద్యాధికారులకు సూచించింది. వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు ప్రారంభం కాగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మధ్యాహ్న భోజనం అమలులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం ఎలా వండిపెట్టాలో ఇప్పటికే వంట నిర్వాహకులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 508 వరకు ఉన్నాయి.

ప్రత్యేక శిక్షణ..

మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు మండల విద్యాధికారులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గతంలోనే ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు, పండుగలు వంటి సందర్భాలలో విద్యార్థులకు ప్రత్యేక భోజనం అందించేలా చూడాలి. అలాగే దాతల సహకారంతో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించేలా కృషి చేయాలి. వీటితో పాటు ప్రతీ పాఠశాలలో స్కూల్‌ న్యూట్రిషన్‌ గార్డెన్లు అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ, ఉద్యాన, అటవీశాఖ సహకారంతో పాఠశాలలో అందుబాటులో ఉన్న స్థలం వినియోగించి ఆకుకూరలు, కూరగాయలు పండించి వాటిని మధ్యాహ్న భోజనానికి వినియోగించుకునేలా అవగాహన కల్పించారు.

పాఠశాలలో చేయాల్సిన పనులు

జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, పీఎం పోషణ్‌ నియమాలను అనుసరించి పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషక విలువలు గల ఆహారం విద్యార్థులకు అందించాలి. ఇందుకుగాను మధ్యాహ్న భోజన వంటశాలలో ఎప్పటికప్పుడు దుమ్ము ధూళి తొలగించి, నీటి ట్యాంకులను బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం చేయాలి. మధ్యాహ్న భోజనానికి వినియోగించే వంట పాత్రలను వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. పాఠశాల ఆవరణలో ప్రతీ రోజు పూర్తిగా పరిశుభ్రం చేయాలి. వంటచేసే సమయంలో శుభ్రమైన దుస్తులు ఆప్రాన్‌, తలవెంట్రుకలు ఆహార పదార్థాలలో పడకుండా తలకు క్యాపు ధరించాలి. చేతులకు గ్లౌజ్‌, మూతికి మాస్క్‌ ధరించాలి.

ఇబ్బందులు తలెత్తకుండా

సురక్షితమైన వంటశాల, నాణ్యమైన ఆహారం, శుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన తాగునీరు ఈ నాలుగు అంశాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా జిల్లా విద్యాధికారులకు, ఎంఈఓలకు, ప్రధానోపాధ్యాయులకు, ప్రత్యేకాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కలెక్టర్‌ నిత్యం పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

మధ్యాహ్న భోజనం మరింత భద్రం

జాగ్రత్తలు తీసుకోవాలని

విద్యాధికారులకు ప్రభుత్వ ఆదేశాలు

వంట సిబ్బందికి, ఉపాధ్యాయులకు

ఒకరోజు శిక్షణ

జిల్లా వ్యాప్తంగా 508 పాఠశాలల్లో

అమలు

పాఠశాలల వివరాలు

మొత్తం పాఠశాలలు – 508

ప్రాథమిక పాఠశాలలు – 341

ప్రాథమికోన్నత పాఠశాలలు – 64

ఉన్నత పాఠశాలలు – 103

మధ్యాహ్న భోజనం మెనూ...

సోమవారం : కిచిడి, కోడిగుడ్డు, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కర్రీ

మంగళవారం : అన్నం, సాంబార్‌, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కర్రీ, రాగిజావ

బుధవారం : అన్నం, పప్పు, ఆకుకూర, కోడిగుడ్డు వెజిటేబుల్‌ కర్రీ

గురువారం : వెజ్‌ బిర్యానీ, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కర్రీ, రాగిజావ

శుక్రవారం : అన్నం, సాంబార్‌, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కర్రీ, కోడిగుడ్డు

శనివారం : అన్నం, పప్పు, ఆకుకూర, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కర్రీ, రాగిజావ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement