వినతుల పరిష్కారం వేగంగా.. | - | Sakshi
Sakshi News home page

వినతుల పరిష్కారం వేగంగా..

Mar 17 2026 7:33 AM | Updated on Mar 17 2026 7:33 AM

ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్‌

సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశం

ప్రజల నుంచి 224 వినతుల స్వీకరణ

కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాట్లు

జనగామ రూరల్‌: కుమారుడు బాగోగులు చూసుకోవడం లేదని ఓ తల్లి, జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భూమి కోల్పోయిన నష్టపరిహారం చెల్లించాలని ఒకరు, మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్‌ రావడం లేదని ఓ లబ్ధిదారుడు, వ్యవసాయ బావుల వద్దకు దారి ఇవ్వడం లేదని గ్రామస్తులు..ఇలా పలు సమస్యలతో ప్రజలు గ్రీవెన్స్‌ సెల్‌కు తరలివచ్చారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లోని కాన్ఫ్‌రెన్స్‌ హాల్‌లో ప్రజావాణికి వచ్చిన ప్రజలను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆప్యాయంగా పలకరించి సమస్యలను విని వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా 224 అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు. ఈమేరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, డీఆర్‌డీఓ వసంత, డీఏఓ అంబికా సోనీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులు కొన్ని ఇలా..

● పాలకుర్తి మండలం విస్నూర్‌ గ్రామానికి చెందిన బి.వసంత, 12 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో జీవనం సాగిస్తున్నామని, గుంట భూమి ఉండగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేశామని, తన ప్రజాపాలన దరఖాస్తును జనగామ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా పొలాస రూరల్‌కు బదిలీ చేయాలని విన్నవిస్తూ దరఖాస్తు చేశారు.

● తరిగొప్పుల మండలం ఎన్యా నాయక్‌ తండాకు చెందిన ఎం.నిర్మల, తనకు గల ఒక గుంట భూమి పట్టా పాస్‌ బుక్‌ లాక్‌ అయిందని, ఆర్డీఓ లాగిన్‌లో ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని వినతి అందజేశారు.

● లింగాల ఘణపురం మండలం వడిచర్ల గ్రామానికి చెందిన రమాదేవి, తనకు సొంత ఇల్లు, సొంత స్థలం ఏమీ లేదని, అద్దెకు ఉంటున్నానని, గతంలో ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నానని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది.

● జిల్లా కేంద్రంలోని వీవర్స్‌ కాలనీ 12వ వార్డుకు చెందిన పెంట సోమలక్ష్మి గత ప్రజాపాలన కార్యక్రమంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నానని, తమకు ఎటువంటి ఇల్లు, ఖాళీ స్థలం లేదని, డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇప్పించాలని వేడుకుంది.

● జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్‌కు చెందిన గౌరోజు సదాశివరావు, హైదరాబాద్‌ రోడ్డులోని ఏకశిల కళాశాల పక్కన తనకు ప్లాటు కలదని, ఆ ప్లాటు కెనాల్‌ కాలువలో పోయిందని, ఈ విషయమై తనకు నష్ట పరిహారం ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.

● గోవర్థనగిరి గ్రామంలో సర్వే నెంబర్‌ 228లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, గతంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు భూ సర్వే కోసం ప్రతిపాదనలు పంపగా ఆర్డీఓ వద్ద పెండింగ్‌లో ఉందని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌కు రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లి గ్రామానికి చెందిన మంతపురం యాదగిరి వినతి పత్రం అందజేశారు.

● పట్టణంలోని రాజీవ్‌నగర్‌ 1వ వార్డు చెందిన చింతల సంపత్‌ తనకు గృహజ్యోతి, గ్యాస్‌ సబ్సిడీ రావడం లేదని, వెంటనే అందజేయాలని వినతి పత్రం అందించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసి..రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు.

● నష్కల్‌ గ్రామం పరిధిలో ఉన్న తమ భూమి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం కోల్పోయామని, నష్టపరిహారం కాజేయాలని తమ పాలివారు ప్రయత్నం చేస్తున్నారని, వారసత్వం కింద తమకే అందజేయాలని చిల్పూరు మండలం వంగాలపల్లికి చెందిన మట్వాడ అంజయ్య వినతి అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement