ఆరోగ్య భాగ్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య భాగ్యం

Mar 18 2026 11:12 AM | Updated on Mar 18 2026 11:12 AM

బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
సహజ సేద్యం..
జిల్లాలో విస్తరిస్తున్న నేచురల్‌ ఫార్మింగ్‌

జీవామృతం, ఘన జీవామృతంపై అవగాహన

మిత్ర పురుగుల సంరక్షణతో జీవవైవిధ్యం

పెట్టుబడులు తక్కువ.. లాభాలు ఎక్కువ

జిల్లాలో 15 క్లస్టర్లు, 1,875 మంది రైతులు

జనగామ: ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌) పథకం కింద జిల్లాలో సహజ వ్యవసాయం వేగంగా విస్తరిస్తోంది. జిల్లా పరిధిలో 15 క్లస్టర్లు ఏర్పాటు చేసి, ప్రతీ క్లస్టర్‌కు 125 మంది చొప్పున 1,875 మంది రైతులకు సహజ వ్యవసాయ కిట్లను అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం 12 మండలాల వ్యాప్తంగా అమలు అవుతోంది. తొలి దశలో గ్రామాల వారీగా ఫార్మర్‌ ఫీల్డ్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసి రైతులకు నేచురల్‌ ఫార్మింగ్‌ తత్వం, పెంపక పద్ధతులు, మట్టిలో జీవాలను పెంపొందించడం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. పథకాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కేంద్రం, రాష్ట్రం, జిల్లా పరిధిలో కోఆర్డినేటర్లు నియమిస్తారు. వీరు సాధారణ రైతు సమూహాలతో సహకరిస్తూ పథకం అమలును పర్యవేక్షిస్తారు.

రసాయనిక ఎరువులకు దూరంగా..

రసాయనాల వినియోగం పెరుగుతున్న నేపధ్యంలో భూసారం తగ్గిపోకుండా, పంటల నాణ్యత దెబ్బతినకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన దిగుబడులు అందేలా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. రసాయనిక వ్యవసాయం వైపు రైతులు మళ్లిపోతున్న పరిస్థితుల్లో, నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులు అవలంభించడం అత్యంత అవసరమని కేంద్రం దృష్టి సారించింది. ఈ పథకం కింద రైతులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ప్రకృతి సిద్ధ ఎరువుల తయారీ వరకు అన్ని అంశాల్లో రైతులకు అధికారులు సలహాలు అందిస్తున్నారు. ముఖ్యంగా జీవామృతం, ఘన జీవామృతం, కషాయాల వంటి సన్నద్ధ పద్ధతుల ద్వారా పూర్తిగా రసాయన రహిత సాగును ప్రోత్సహిస్తున్నారు. రైతులు మార్కెట్‌ ఆధారిత రసాయన ఎరువులపై ఆధారపడకుండా, తమ వద్దే లభించే పదార్థాలతో ఎరువులు తయారు చేసుకునే విధానం ఈ పథకంలో భాగం. అలాగే స్థానిక విత్తనాల వినియోగం, పంటల వైవిధ్యాన్ని పెంపొందించడం, మిత్ర పురుగుల రక్షణ, సహజ రీతిలో జీవ వైవిధ్యం పెంపుదల వంటి అంశాలను రైతులకు బోధిస్తున్నారు. ఈ పథకం ద్వారా రసాయన వ్యయాలు తగ్గి, రైతుల ఆదాయం పెరగడంతో పాటు నేల జీవసమృద్ధి కూడా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో సహజ వ్యవసాయం మరింత విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సహజ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో ఈ పథకానికి మంచి స్పందన లభించడంతో, మరిన్ని క్లస్టర్లను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు.

శిక్షణ.. వర్క్‌షాపులు

మట్టి ఆరోగ్యం–పర్యావరణ సుస్థిరతని సాధించడం పథకం ప్రధాన లక్ష్యం. రైతులకు ప్రతీ ఎకరాకు నేచురల్‌ ఫార్మింగ్‌ అమలు కోసం ఆర్థిక అస్సిస్టెన్స్‌ ఇవ్వబడుతుంది. శుద్ధ జీవ ఎరువులు, పది రకాల లేదా అంతకన్నా ఎక్కువ జీవసిద్ధ సిప్‌ ఎరువుల తయారీకి స్థానిక స్థాయిలో శిక్షణ, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. నేచురల్‌ పద్ధతుల ద్వారా పంటలు, పప్పు దినులపంటలు వేసుకునేలా మార్గనిర్ధేశకాలు అందిస్తారు. రైతులు ఎటువంటి రసాయనాలపై ఆధార పడకుండా పంటల ఆరోగ్యం, పెట్టుబడి పెంపొందించుకోవచ్చు. రైతులకు సాంకేతిక సహాయం, మార్కెట్‌ లింక్‌, నేచురల్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం కేంద్రం ప్రత్యేక ప్రక్రియలు రూపొందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement