నర్మెట: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయుడిగా మారిపోయారు. మండలంలోని మాన్సింగ్‌తండాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. తరగతి గదులను, వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించాలని ప్రత్యేక అధికారి బైరోజు రజితకు సూచించడంతో పాటు విద్యార్థినుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆస్పత్రి గదులను, పరిసరాలను, రికార్డులను పరిశీలించి, సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యాధికారి సిద్ధార్థరెడ్డికి సూచించారు.


