జనగామ రూరల్: ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ తొలగింపును నిలిపివేయాలని ఆదివారం ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డికి హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో మహిళలు వినతి పత్రం అందజేశారు. పట్టణ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ కాంప్లెక్స్ గోడ మూల వద్ద గత కలెక్టర్ రిజ్వాన్ బాషా చొరవతో డ్వాక్రా గ్రూపు మహిళలు పాలమాకుల చిన్న మంజుల, పోత్కనూరి విజయలక్ష్మి వనితా టీ స్టాల్, విజయ పాల ఉత్పత్తి పార్లర్ ఏర్పాటు చేశారు. ఇటీవల కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మున్సిపల్ పోలీసు అధికారులతో 10వ తేదీ, 11వ తేదీ తొలగించే ప్రయత్నం చేశారని చామల కుమార్ రెడ్డికి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలను ఆర్థికంగా ఎదగడం కోసం చిన్న వ్యాపారాలకు సహకరిస్తున్నారని, కలెక్టర్ చర్యలు మాత్రం నష్టదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బానోతు ధర్మభిక్షం నాయక్ , పాలమాకుల కనకయ్య, సోమయ్య పాల్గొన్నారు.
ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డికి మహిళల వినతి


