రాములోరి కల్యాణానికి కోటి తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

రాములోరి కల్యాణానికి కోటి తలంబ్రాలు

Mar 15 2026 1:21 AM | Updated on Mar 15 2026 1:21 AM

బచ్చన్నపేట: మండలంలోని గోపాల్‌నగర్‌ గ్రామం నుంచి భద్రాచలంలో శ్రీరామ కల్యాణానికి కోటి తలంబ్రాలను గ్రామస్తులు పంపించారు. శనివారం భద్రాచలం ఆలయం నుంచి వచ్చిన స్వామి రామకోటి రామరాజుతో భద్రాచలం పంపించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. భద్రాచల ఆలయం వారు పంపించిన వడ్ల ప్యాకెట్లను తీసుకొని రామభక్తులు చేతితో ఒలిచి మళ్లీ ప్యాకెట్లలో పెట్టి కోటి తలంబ్రాలను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పేరబోయిన కళ్యాణి పర్షరాములు, ఉపసర్పంచ్‌ చింతల కర్ణాకర్‌, భక్తులు దొంతుల రాజు, కొత్తపల్లి కాశీపతి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులు

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేటకు రెండు ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపో మేనేజర్‌ ఎస్‌.స్వాతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ నుంచి సిద్దిపేటకు 05:40, 07:10, 10:00, 11:10, 14:30, 14:40, 17:50, 18:20 గంటల వరకు, సిద్దిపేట నుంచి జనగామకు 07:45, 09:15, 12:15, 12:45, 16:10, 16:35, 19:45, 20:10 గంటల సమయాల్లో సర్వీసులు ఉంటాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన

జనగామ రూరల్‌: మండలంలోని పెంబర్తి ఎంజేపీ మహిళ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థినుల ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శనివారం గ్రామంలో డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా డిజిటల్‌ చెల్లింపుల ఉపయోగాలు, భద్రతా జాగ్రత్తలు, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యాప్‌ల ద్వారా సులభంగా డబ్బులు పంపడం, స్వీకరించడం ఎలా అనే విషయాలను వివరించారు. నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్‌ లావాదేవీలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ జ్యోత్స్న, విద్యార్థులు పాల్గొన్నారు.

కోచ్‌ ఫ్యాక్టరీలో కొలువులివ్వాలి..

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, గ్రామస్తులకు, కాజీపేట పరిసర ప్రాంతాల వారికి, రైల్వే ఆక్ట్‌ అప్రెంటీస్‌ చేసిన వారికి, ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ కన్వీనర్‌ దేవులపల్లి రాఘవేందర్‌ అన్నారు. కాజీపేట రైల్వే ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేందర్‌ మాట్లాడుతూ.. ఆదివారం రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్‌ ఎదుట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే జేఏసీ చైర్మన్‌ కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని రైల్వే జేఏసీ చేపడుతున్న డిమాండ్లు నెరవేరే వరకు అందరి సహకారం ఉండాలన్నారు. కాజీపేట డివిజన్‌ కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, రైల్వే జేఏసీ దీక్షను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైల్వే జేఏసీ బృందం పాక వేద ప్రకాశ్‌, గుర్రపు సుధాకర్‌రావు, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement