జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డు ఏరియాలోని బతుకమ్మకుంట జంక్షన్ ప్రాంతంలో గత కలెక్టర్ ప్రారంభించిన వనిత టీ స్టాల్ తొలగింపునకు సంబంధించి గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ ప్రహరీ వెంట ఉన్న విజయ డెయిరీ ప్రోడక్ట్స్, టీస్టాల్‌ను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ రెడ్డితో కలిసిరాగా నిర్వాహకులు ఆందోళనకు దిగారు. వాటిని తొలగించవద్దని బాధితులు అడ్డుకున్నారు. డీఆర్‌డీఏ ద్వారా రూ.3 లక్షల రుణం తీసుకొని ఏర్పాటు చేశామని దీనిని గత కలెక్టర్ ప్రారంభించగా ఇప్పుడు ఎలా తొలగిస్తున్నారని ఆవేదన చెందారు. తాము తీసుకున్న రుణం తిరిగి చెల్లించి డబ్బాను తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గంటసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, సీపీఎం నాయకులు మద్దతు పలకగా కమిషనర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


