వెల్లువలా వినతులు | - | Sakshi
Sakshi News home page

వెల్లువలా వినతులు

Mar 10 2026 12:46 PM | Updated on Mar 10 2026 12:46 PM

ప్రజావాణిలో 157 దరఖాస్తుల స్వీకరణ

సత్వరమే పరిష్కరించాలని

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

పక్క ఫొటోలోని వృద్ధ దంపతుల పేర్లు చల్లా మధుసూదన్‌ రెడ్డి, సులోచన. వీరిది బచ్చన్నపేట మండలం బండానాగారం గ్రామం. వీరికి 32 ఎకరాల భూమి ఉంది. అందులో 25 ఎకరాల భూమిని తమ ఇద్దరు కొడుకులకు గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే తమ పేరు మీద 7 ఎకరాలను అమ్ముకుందామంటే కుమారులు కొర్రీలు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు. మొన్నటి వరకు వచ్చిన రైతు భరోసాతో కాలం గడిచిందని, తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, మందులకు చాలా ఇబ్బందవుతోందన్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరగా.. సంబంధిత ఆర్డీఓకు సమస్యను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

ఈ ఫొటోలోని దివ్యాంగ మహిళ పేరు పాలబిందెల విజయలక్ష్మి. జనగామ పట్టణం 25వ వార్డు. పుట్టుకతో రెండు కాళ్లు పడిపోయాయి. ఆమె భర్త నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందగా తన కుమార్తె దగ్గర ఉంటోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 90శాతం సదరం సర్టిఫికెట్‌తో రూ.1500ల పెన్షన్‌ తీసుకుంది. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగం కావడంతో రిటైర్డ్‌ కాగా వచ్చే పెన్షన్‌ తనకు ఆధారంగా ఉంటుందని అనుకుంది. దివ్యాంగ పింఛన్‌ రావడంతో అది తొలగించాలని కోరగా రద్దు చేశారు. గత ఏడేళ్ల నుంచి కలెక్టరేట్‌ చుట్టు తిరుగుతున్న తనకు దివ్యాంగుల పెన్షన్‌ ఇవ్వాలని వేడుకుంటోంది.

జనగామ రూరల్‌: కుమారులు తమను చూసుకోవడం లేదని, గిఫ్ట్‌ భూమిని తిరిగి ఇవ్వాలని, ఇందిరమ్మ బిల్లు రాక ఇబ్బందులు పడుతున్నామని, సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూమి పట్టా చేయాలని, రుణమాఫీ కావడం లేదని..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌కు ప్రజలు తరలివచ్చారు. ఈసందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌ 157 దరఖాస్తులు వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధి జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరామ్‌, డీఎస్‌ వెంకన్న, డీఆర్‌డీఓ వసంత, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మల్జికార్జున్‌ రావు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులు కొన్ని ఇలా..

జనగామ మండలం గానుగుపహాడ్‌కు చెందిన బింగి వెంకటమ్మ తన భర్త భిక్షపతి, దివ్యాంగుల పెన్షన్‌ పొందుతూ మరణించాడని, తను కూడా దివ్యాంగురాలు అయినందున తనకు భర్త పింఛన్‌ ఇప్పించాలని లేదా కొత్తగా దివ్యాంగుల పింఛను మంజూరు చేయాలని వేడుకుంది.

పెంబర్తి గ్రామానికి చెందిన కంతిరి వనిత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, గ్రామంలో తమకు ఎలాంటి ఆస్తులు లేవని అద్దె భవనంలో ఉంటున్నామని ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందించారు.

పట్టణంలోని 16వ వార్డు సంజయ్‌నగర్‌కు చెందిన ఎమ్డీ నూర్జహాన్‌ చాలా సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నాను. తాను నిరుపేదను అయినందున డబుల్‌ బెడ్‌రూమ్‌ కోసం విన్నవిస్తూ అర్జీని సమర్పించారు.

తరిగొప్పుల మండల కేంద్రంలో 1990లో సాదాబైనామా కింద సర్వేనెంబర్‌ 248/5లో 23 గుంటలు, 248జీలో 38 గుంటల భూమిని కొనుగోలు చేశానని, నాటి నుంచి ఖాస్తులో ఉన్నానని, గ్రామానికి చెందిన మరొక వ్యక్తి భూమిని పట్టా చేయకుండా అడ్డుకుంటున్నాడని జంగా ముత్తయ్య అనే వ్యక్తి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు.

ఇందిరమ్మ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం పామునూరు గ్రామానికి చెందిన తాళ్లపల్లి శారద వినతి పత్రం అందించారు. ఆధార్‌ కార్డు నెంబర్‌లో ఇంటిపేరు, వ్యక్తుల పేర్లు ఒకటిగా ఉండడంతో వేరే వ్యక్తులకు సంబంధించి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేశారని, ఇల్లు బేస్‌మెంట్‌ పూర్తి చేసి ఎనిమిది నెలలు అవుతోందని, సొంతంగా మూడు లక్షలుఖర్చు చేశానని, ఆధార్‌ కార్డు మార్చి న్యాయం చేయాలని కోరారు.

ఆన్‌లైన్‌లో ప్రజాపాలన దరఖాస్తు వివరాలు నమోదు చేయలేదని జనగామ పట్టణంలోని 12వ వార్డు నారాయణ మమత దరఖాస్తు అందించారు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా ఆన్‌లైన్‌లో కనబడడం లేదని, దీంతో వార్డు అధికారి డబుల్‌ బెడ్‌రూమ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారని తెలిపారు. తాను ఒంటరి మహిళనని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఎలాంటి ఆస్తి లేదని అద్దె ఇంట్లో ఉంటున్నామ ని, ప్రజాపాలన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement